భావితరాలకు తెలుగుభాష ఔన్నత్యాన్ని తెలియజేయాలి..


Ens Balu
6
Kakinada
2021-08-29 16:02:00

తెలుగు భాష ఔన్నత్యాన్ని భవిష్యత్ తరాలకు అందించడంతో పాటు తెలుగు భాషా పరిరక్షణకు, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని  రాష్ట్ర వ్యవసాయ, సహకార, ఫుడ్ ప్రాసెసింగ్, మార్కెటింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. వ్యవహారిక భాష పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా ఆదివారం విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం, నెల్లూరు ,తెలుగు, సంస్కృత అకాడమి, ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా "తెలుగు భాష - ప్రయోగాలు - పరిశోధనలు" అనే అంశంపై వర్చువల్ పద్ధతిలో నిర్వహించిన జాతీయ సదస్సులో కాకినాడ గ్రామీణం రమణయ్యపేట మంత్రి కన్నబాబు క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు.     ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ కొంతమంది పండితులు మాత్రమే మాట్లాడడానికి, చదవడానికి పరిమితమైన గ్రాంథిక భాషను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి  ఉద్యమాన్ని చేపట్టి  వ్యవహారిక భాష ద్వారా పామర జనులు సైతం చదవటం,మాట్లాడగలిగే విధంగా చేసిన గొప్ప మహనీయుడు గిడుగు రామ్మూర్తి పంతులు అని  అన్నారు. ఆ మహనీయుని పుట్టిన రోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం శుభపరిణామమన్నారు. తెలుగు భాషలో కాలక్రమేణా అనేక పరిణామాలకు లోను కావడంతో ఎన్నో ఇతర భాషల పదాలు తెలుగులో స్థిరపడ్డాయన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు చేసిన వ్యవహారిక భాషా ఉద్యమ ఫలితంగా తాపీ ధర్మారావు లాంటి గొప్ప కవులు ఎందరో 1930 సంవత్సరం నుంచే వ్యవహారిక భాషలో తమ రచనలు చేయడం జరిగిందన్నారు. అమ్మలాంటి తెలుగు భాష అజరామమైనదని,తెలుగు భాష అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో విధానాలు అమలు చేస్తున్నారన్నారు. నేటి ప్రపంచమంతా ఒక గ్లోబల్ విలేజ్ గా మారుతున్న తరుణంలో పేద విద్యార్థులు సైతం ఈ పోటీ ప్రపంచంలో నిలవాలనే  ఉద్దేశంతో తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్ భాషను ప్రాథమిక స్థాయి నుంచి బోధించేందుకు ముఖ్యమంత్రి అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఒకే పాఠ్యాంశాన్ని తెలుగు,ఇంగ్లీష్ భాషలలో పక్కపక్కన ముద్రించిన  పాఠ్యపుస్తకాలు  అందిస్తున్న రాష్ట్రం మనదేనని, దీని ద్వారా పిల్లలు పాఠ్యాంశాన్ని అంశాన్ని సులువుగా అర్థం చేసుకోవడంతో పాటు భాష మీద నైపుణ్యం సంపాదించడానికి అవకాశం ఉంటుందన్నారు. తెలుగు భాష పరిరక్షణకు పాటు పడే సంస్థలను,వ్యక్తులను గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, కాళీపట్నం రామారావు మాస్టారు స్థాపించిన కళా నిలయానికి డా. వైఎస్సార్ లైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డును ఇటీవలే ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగిందన్నారు. తెలుగువాడిగా తన వంతు బాధ్యతగా తెలుగు భాష అభివృద్ధికి పరిరక్షణకు పాటుపడడం జరుగుతుందని మంత్రి తెలిపారు. తెలుగు భాషను భవిష్యత్ తరాలకు అందించడానికి అన్ని విశ్వవిద్యాలయాల వారు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ముందుకు సాగాలని మంత్రి  కన్నబాబు విశ్వవిద్యాలయ అధిపతులకు తెలిపారు.   ఈ వర్చువల్ సదస్సులో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం, తెలుగు, సంస్కృత అకాడమి అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.