మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతిని పురస్కరించుకుని వచ్చేనెల 2వ తేదీన వైఎస్సార్సీపీ యువ నాయకులు డాక్టర్ దర్మాన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో నరసన్నపేటలో మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ మేరకు కృష్ణ మెడికల్ సెంటర్ (కేఎంసీ), జెమ్స్ సారథ్యంలో జరగనున్న ఈ వైఎస్సార్ మెగా వైద్య శిబిరంలో 46 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ముఖ్యఅతిథిగా ఈ శిబిరాన్ని ప్రారంభిస్తారు. అదే రోజు నిర్వహించే రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లాటకర్ విశిష్ట అతిథిగా ప్రారంభించనున్నారు. రోగులకు ఉచితంగా మందులను అందజేసి, వైద్య పరీక్షల్లో తీవ్రత గుర్తించిన రోగులకు జెమ్స్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తారు. వైద్య శిబిరం ఏర్పాట్లకు సంబంధించి స్వతహాగా వైద్యులైన యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్యతో జెమ్స్ ప్రతినిధులు డాక్టర్ బాల మురళి, డాక్టర్ ప్రవీణ్ లు నరసన్నపేటలో సోమవారం ఉదయం సమావేశమై ఏర్పాట్లు చేశారు.