తిరుమలలో వాహనాల కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా పవిత్రతను, పర్యావరణాన్ని కాపాడి హోలీ గ్రీన్ సిటీగా మారుస్తామని, ఇందుకోసం దశలవారీగా పూర్తిగా విద్యుత్ వాహనాలను వినియోగిస్తామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి వెల్లడించారు. రాంభగీచా విశ్రాంతి గృహాల వద్ద సోమవారం ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డితో కలిసి 35 విద్యుత్ కార్లను ఛైర్మన్ ప్రారంభించారు. ముందుగా విద్యుత్ కార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ, తిరుమలలో దశలవారీగా డీజిల్ వాహనాల స్థానంలో పూర్తిగా విద్యుత్ వాహనాలు ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. మొదటి దశలో టిటిడి అధికారిక విధుల కోసం వినియోగించేందుకు 35 విద్యుత్ కార్లను(టాటా నెక్సాన్) ప్రారంభించినట్టు చెప్పారు. ఈ విద్యుత్ కార్లను ప్రభుత్వరంగ సంస్థ అయిన కన్వర్జన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్(సిఇఎస్‌ఎల్) నుండి తీసుకున్నామన్నారు. రెండో దశలో మరో 6 నెలల లోపు 32 విద్యుత్ బస్సులు నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఇందులో 20 టిటిడి ఉచిత బస్సులు కాగా, మరో 12 బస్సులను ఆర్‌టిసి నడుపుతుందన్నారు. ఆర్‌టిసి నడిపే ఈ 12 బస్సులు శ్రీవారి పాదాలు - ఆకాశగంగ - పాపవినాశనం మార్గంలో నడుస్తాయని తెలిపారు. టిటిడి విజ్ఞప్తి మేరకు మరో 6 నెలల వ్యవధిలోపు ఎపిఎస్ఆర్‌టిసి కూడా తిరుమల - తిరుపతి ఘాట్ రోడ్లలో విద్యుత్ బస్సులు నడిపేందుకు ముందుకొచ్చిందన్నారు. తిరుమలలో, ఘాట్ రోడ్లలో ప్రయాణించే ట్యాక్సీ / మ్యాక్సీ యజమానులు, టిటిడి ఉద్యోగులు, స్థానికులు, దుకాణదారులు కూడా తమ వాహనాలను విద్యుత్ వాహనాలుగా మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కాగా, ఒక్కో విద్యుత్ వాహనానికి నెలకు రూ.33,600/- చొప్పున 5 సంవత్సరాల పాటు ఇఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఐదేళ్ల తరువాత ఈ వాహనాలు టిటిడి సొంతమవుతాయి. ఈ వాహనాల నిర్వహణ వ్యయాన్ని 5 సంవత్సరాల పాటు సదరు సంస్థ భరిస్తుంది. పూర్తిగా ఛార్జింగ్ చేసిన వాహనం 250 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఒక వాహనం పూర్తి ఛార్జింగ్ కోసం సాధారణ AC విద్యుత్ ద్వారా అయితే 8 గంటలు, DC విద్యుత్ ద్వారా అయితే 90 నిమిషాల సమయం పడుతుంది. ఒక వాహనం పూర్తి ఛార్జింగ్ కోసం 30 యూనిట్ల విద్యుత్ అవసరమవుతుంది. ప్రస్తుత ధరల ప్రకారం ఒక యూనిట్ విద్యుత్ ధర రూ.6.70/- కాగా, ఒక కిలోమీటరు దూరం ప్రయాణించేందుకు 80 పైసలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, ట్రాన్స్‌పోర్టు జిఎం శేషారెడ్డి, డిఐ మోహన్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.