నులిపురుగుల నివారణతో ఆరోగ్యం..


Ens Balu
6
Srikakulam
2021-08-31 09:14:51

శరీరంలో నులిపురుగులను నివారించుకోవడం ద్వారా ఆరోగ్యం ప్రాప్తిస్తుందని శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ ఓబులేసు అన్నారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినం సందర్భంగా నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ కార్యక్రమం స్థానిక హడ్కో కాలనీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మంగళ వారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓబులేసు పాల్గొన్నారు. విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు ఇచ్చి తినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నులిపురుగుల సంక్రమించి ఉన్న చిన్నారుల నుండి ఇతరులకు వ్యాపిస్తుందని అన్నారు. నులి పురుగుల వల్ల రక్తహీనత సంభవిస్తుందని, పోషకాహారం తీసుకున్నప్పటికీ ఉపయోగకరంగా ఉండదని, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవాలని తద్వారా నులి పురుగులు నివారణ జరిగి తీసుకునే ఆహారం శరీరానికి అవసరమైన పోషకాలను అందించి ఆరోగ్యంగా ఉంచుతుందని చెప్పారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన పనులు చేసుకోవడానికి, చదువుకోవడానికి తగిన శక్తి,  మానసిక పెరుగుదల ఉంటుందని ఆయన చెప్పారు. ప్రతి ఒక్క చిన్నారి విధిగా ఆల్బెండజోల్ మాత్రలు సూచించిన మేరకు తీసుకుని ఆరోగ్యం కాపాడుకోవాలని అన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బిం, రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం సమన్వయ అధికారి మరియు జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ కే.అప్పారావు, వైద్య శాఖ అధికారి కృష్ణమోహన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వైద్యాధికారి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.