విజయనగరం జిల్లాలో మంగళవారం చేపట్టిన కోవిడ్ ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతమైంది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్‌కు మంచి స్పందన లభించింది. జిల్లాలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా చేపట్టిన ఈ డ్రైవ్ ద్వారా సాయంత్రం 7.00 గంటల వరకు 47 వేల మందికి పైగా మంగళవారం ఒక్క రోజులో వ్యాక్సినేషన్ వేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత శనివారం నుంచి మంగళవారం వరకు నిర్వహించిన మూడు రోజుల కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ లో 1.20 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడం జరిగిందన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ పై జిల్లా యంత్రాంగం వలంటీర్ల ద్వారా విస్తృత ప్రచారం చేయడంతో మంగళవారం ఉదయం 7 గంటల నుంచే కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల వద్దకు 18 నుంచి 45 ఏళ్ల లోపు వయస్సు వారు, 45 ఏళ్లకు పైబడిన వయస్సు కలిగిన వారు వ్యాక్సిన్ కేంద్రాలకు చేరుకున్నారు. వి.ఆర్.ఓ., వి.ఏ.ఓ., ఏ.ఎన్.ఎం., ఆశ కార్యకర్తలు ఒక బృందంగా ఏర్పడి ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్ చేయించుకోవలసిన వారిని గుర్తించి వ్యాక్సిన్ వేయాల్సిన వారి జాబితా సిద్దం చేశారు. గ్రామ సచివాలయ వలంటీర్లు వ్యాక్సిన్ తీసుకోవలసిన వారి ఇళ్లకు వెళ్లి టీకా కేంద్రాలకు తీసుకువచ్చారు. టీకా కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిబ్బంది ఏర్పాట్లు చేయడంతో వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతమయ్యింది. గత శని, ఆదివారాల్లో నిర్వహించిన డ్రైవ్‌లో 69,661 మందికి వ్యాక్సిన్ వేయగా మంగళవారం 47 వేల మందికి వ్యాక్సిన్ వేశారు.
జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి ప్రతి గంటకు వ్యాక్సిన్ వేసుకున్న వారి సంఖ్యను గమనిస్తూ మండల స్థాయి అధికారులను అప్రమత్తం చేసి తక్కువగా నమోదైన మండలాలను మరింత వేగవంతం చేసేలా ప్రోత్సహించారు. జిల్లాలో 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయసు వారికి, 45 ఏళ్ల పైబడిన వారికి కలసి మొత్తం 6.41 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాల్సి వున్నట్టు జిల్లా యంత్రాంగం గుర్తించగా ఇందులో 17శాతం లక్ష్యాన్ని సాధించగలిగామని కలెక్టర్ పేర్కొన్నారు.