అర్జీలను సత్వరమే పరిష్కరించాలి..


Ens Balu
2
Guntur
2021-09-01 15:48:37

ప్రభుత్వ శాఖలకు ప్రజా ప్రతినిధులు నుంచి వివిధ అంశాలపై వస్తున్న అర్జీలను సత్వరమే సక్రమంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అదికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ హాలులో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ప్రభుత్వ శాఖలకు ప్రజా ప్రతినిధులు నుంచి వస్తున్న అర్జీల పరిష్కారం పై, గత నెలలో జరిగిన డీఆర్సీ సమావేశంలో ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు తీసుకున్న చర్యల నివేదికపై   అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా మంత్రులు, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు అందించిన అర్జీలపై అధికారులు తీసుకున్న చర్యలపై జిల్లా కలెక్టర్ సమీక్షించి అధికారులకు సూచనలు అందించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు అందించిన అర్జీలకు  అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలపై జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి సంబంధిత రాష్ట్ర శాఖలకు అర్జీలు పంపించి అవి పరిష్కారించేలా జిల్లా స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అర్జీలపై తీసుకున్న చర్యలపై యాక్షన్ టేకెన్ రిపోర్టును సంబంధిత ప్రజా ప్రతినిధులకు లిఖిత పూర్వకంగా అందించాలన్నారు. శాఖలలో జరుగుతున్న అవినీతిపై ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అర్జీలపై వెంటనే విచారణ జరిపించాలని, ప్రాధమిక అధారాలు ఉంటే పోలీస్ కేసులు నమోదు చేయటంతో పాటు, విచారణ కోసం విజిలెన్స్ శాఖకు సిఫార్సు చేయాలన్నారు. ప్రజా ప్రతినిధుల నుంచి అందుతున్న అర్జీలను సంబంధిత శాఖలకు అందించేందుకు, అర్జీలపై అధికారులు తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించేందుకు సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ప్రత్యేక విభాగంను ఏర్పాటు చేయాలన్నారు. గత డీఆర్సీ సమావేశంలో ప్రజా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సంబంధించి తీసుకున్న చర్యలపై బుధవారం సాయంత్రం నాటికి సంబంధిత శాఖలు నివేదికలు అందించాలన్నారు.
సమావేశంలో సంయుక్త కలెక్టర్ (రైతు భరోసా, రెవెన్యూ) ఏఎస్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి) పి ప్రశాంతి, సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) కే శ్రీధర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి పి కొండయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.