ఒకటవ తేదీనే పూర్తిగా పెన్షన్లు ఇస్తున్నాం..


Ens Balu
6
Guntur
2021-09-01 15:51:12

గుంటూరు జిల్లాలో ప్రతీ నెల 1వ తేదిన 99% శాతం పెన్షన్లు  అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక కే.వి.పి కాలనీ 74 వ వార్డు సచివాలయం కి చెందిన షేక్ బాజీ అనే దివ్యంగునికి ఇంటికి చేరుకొని ట్రై సైకిల్ మరియు పెన్షన్ ను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు స్పందించి దివ్యాంగుడైన షేక్ బాజీకి జిల్లా విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్ జెండర్ మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ  ద్వారా ట్రై సైకిల్ తో రూ.3వేల పెన్షన్  ను అందించినట్లు  జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఇంకా ఎవరైనా అర్హత కలిగిన దివ్యాంగులు ఉంటే సమాచారం అందిస్తే, వారికి సాయం చేస్తామన్నారు. దివ్యాంగుల కోటాలో ప్రతీనెల బాజికి పెన్షన్ అందిస్తామని పేర్కొన్నారు. అదే విధంగా జిల్లాలో ప్రతీ నెల 1వ తేదిన పెన్షన్లను  అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ  నేరుగా వారి ఇళ్ళకు వెళ్ళి సచివాలయ వాలంటీర్లు అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాలను ప్రజలు కోరుకున్న విధంగా  అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి కమీషనర్ శ్రీనివాసరావు, ఆర్.డి.ఒ భాస్కర్ రెడ్డి, సాంఘీక సంక్షేమశాఖ డిప్యూటి డైరెక్టర్ మధు సూదనరావు, తూర్పు మండల తహాశీల్ధార్ శ్రీకాంత్, వెల్ఫేర్ సెక్రటరీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.