సాగరమాల అభ్యంతరాలపై విచారణ..
Ens Balu
1
East Godavari
2021-09-01 15:56:14
సాగరమాల ప్రాజెక్టు పరిధిలో 40.39 కి.మీ. రహదారికి సంబంధించి దాదాపు 597 ఎకరాల భూసేకరణపై 3ఏ నోటిఫికేషన్ ప్రకారం అందిన అభ్యంతరాల పిటిషన్లపై జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ), కాంపిటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ అక్వజిషన్ (కాలా) డా. జి.లక్ష్మీశ వ్యక్తిగత విచారణ జరిపారు. బుధవారం యు.కొత్తపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో ఈ విచారణ కార్యక్రమం జరిగింది. విస్తృత ప్రజాప్రయోజనార్థం చేపడుతున్న సాగరమాల ప్రాజెక్టు భూసేకరణపై కాకినాడ రూరల్, యు.కొత్తపల్లి మండలాలకు చెందిన వారినుంచి 65 పిటిషన్లు రాగా ప్రతి పిటిషన్‌దారునితో జాయింట్ కలెక్టర్ నిశితంగా మాట్లాడి, విచారణ జరిపారు. వారు వ్యక్తం చేసిన వివిధ అంశాలను క్షుణ్నంగా పరిశీలించారు. చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తెలిపారు. ముందుగా నోటీసులు జారీచేసి చట్ట ప్రకారం ఈ వ్యక్తిగత విచారణ చేపట్టారు. ఈ రహదారి కాకినాడ రూరల్, యు.కొత్తపల్లి, తొండంగి, శంకవరం మండలాల పరిధిలోని 21 గ్రామాల గుండా వెళ్తుంది. ఈ విచారణ కార్యక్రమంలో కాకినాడ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ; యు.కొత్తపల్లి, తొండంగి తహసీల్దార్లు శివకుమార్, రాజు; నేషనల్ హైవేస్ ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.