డా.వైఎస్సార్ ఆశయాలు సాధించాలి..
Ens Balu
3
Vizianagaram
2021-09-02 08:43:00
డా.వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనకు పునరంకితం కావాలని, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖామంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. దివంగతులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ వర్థంతి సందర్భంగా, గురువారం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ఆర్ పరిపాల దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, ఫీజు రీఎంబర్స్ మెంట్ లాంటి పథకాలు ఎందరికో మార్గదర్శకంగా మారాయన్నారు. వ్యవసాయం అంటే వైఎస్ఆర్ కు ప్రాణమని, రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని అన్నారు. ఏ పథకం ప్రవేశపెట్టినా, ఎంతో దూరదృష్టితో ఆలోచించి, అత్యధికశాతం మందికి మేలు చేకూర్చేలా, వాటిని అమలు చేసి, వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. వైఎస్ఆర్ అంటేనే తెలుగు ప్రజలకు ఒక భరోసా అని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్ మోహనరెడ్డి, తండ్రిని మించిన తనయుడిగా కొద్దికాలంలోనే పేరు తెచ్చుకున్నారని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, నవరత్నాల ద్వారా లక్షలాది మంది పేదలకు ఆయన లబ్ది చేకూర్చారని, కరోనా కష్టకాలంలో ప్రజలకు ఆర్థికంగా అండగా నిలిచారని కొనియాడారు. సంక్షేమము, అభివృద్ది రెండూ, మన ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డికి రెండు కళ్లు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎంఎల్ఏ కోలగట్ల వీరభద్రస్వామి, మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, జిసిసి ఛైర్ పర్సన్ శోభా స్వాతిరాణి, పలువురు అధికారులు, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.