కోవిడ్ వేక్సినేషన్ శతశాతం పూర్తికావాలి..
Ens Balu
3
Vizianagaram
2021-09-02 08:44:57
కోవిడ్ వేక్సినేషన్ కార్యక్రమం శతశాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి ఆదేశించారు. స్థానిక ధర్మపురిలోని 36వ సచివాలయాన్ని కలెక్టర్ సూర్యకుమారి, గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ ముందుగా హాజరు పట్టిక, ఇతర రికార్డులను తనిఖీ చేశారు. ఆ సచివాలయ పరిధిలో కోవిడ్ వేక్సినేషన్, గర్భిణులకు ప్రత్యేకంగా వేక్సినేషన్, వారికి అందజేస్తున్న పోషకాహారం వివరాలు, పెన్షన్ల పంపిణీ, మాతృవందన తదితర ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. వాటిపై సచివాలయ సిబ్బందిని వివరాలు అడిగారు. కుల, జనన, మరణ ధృవీకరణ పత్రాలను ఎన్ని రోజుల్లో జారీ చేస్తున్నదీ తెలుసుకున్నారు. రైస్ కార్డుల్లో చేర్పులు, మార్పులపై ఆరా తీశారు. అగ్రిగోల్డు బాధితులకు ఇచ్చిన నష్టపరిహారం వివరాలను అడిగారు. వార్డులో శానిటేషన్ వివరాలు, డెంగ్యూ, మలేరియా తదితర వ్యాధుల స్థితిగతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందిని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రతీఒక్కరికీ వేక్సిన్ వేయాలని ఆదేశించారు. ప్రజలనుంచి వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు పరిశీలించి, వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని కలెక్టర్ కోరారు. ఈ తనిఖీలో మున్సిపల్ కమిషనర్ ఎస్ ఎస్ వర్మ కూడా పాల్గొన్నారు.