రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి నాడు - నేడు పనుల విషయంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జేసీ మహేశ్ కుమార్ పేర్కొన్నారు. నాడు-నేడు పనులను వ్యక్తిగత పనులుగా భావించి, అంకితభావంతో పని చేయాలని సూచించారు. మనబడి నాడు-నేడు రెండో దశ ప్రక్రియపై ఇంజనీరింగ్ అధికారులకు, మండల రిసోర్స్ పర్సన్స్‌కు కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన ఒక్క రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాఠశాల అభివృద్ధికి నిజంగా అవసరమైన పనులనే గుర్తించాలని ఈ సందర్భంగా సూచించారు. ప్రభుత్వ ధనం సద్వినియోగం అయ్యేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. నాడు-నేడు తొలి దశలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని రెండో దశ పనుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పాఠశాలల అభివృద్ధికి అవసరమైన అన్ని రకాలు చర్యలు చేపట్టాలని సూచించారు. మండల రిసోర్స్ పర్సన్లు, ఇంజినీరింగ్ విభాగ అధికారులు సమన్వయంతో వ్యవహరించి రెండో దశ నాడు-నేడు పనుల్లో ఆశాజనక ఫలితాలను సాధించాలని జేసీ పేర్కొన్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్షా అభియాన్ ఏపీసీ కీర్తి, ఈఈ రవిశేఖర్, ఏపీడబ్ల్యూఐడీసీ ఈఈ శామ్యూల్, ఏపీవో గోపీ, మండల రిసోర్స్ పర్సన్లు, ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.