సంప్ర‌దాయ యుద్ద‌విద్య‌లకు ప్రోత్సాహం..


Ens Balu
4
Vizianagaram
2021-09-02 09:08:47

క‌త్తిసాము, క‌ర్ర‌సాము లాంటి యుద్ద‌విద్య‌ల‌కు విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎంతో ప్ర‌సిద్ది అని, వాటిని ప్రోత్స‌హించడం ద్వారా భావిత‌రాల‌కు అందించేందుకు కృషి చేస్తామ‌ని రాష్ట్ర పుర‌పాల‌క‌, పట్ట‌ణాభివృద్ది శాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. వీటిని సాధ‌న చేసేందుకు విజ‌య‌న‌గ‌రంలో  ఒక శిక్ష‌ణా కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌డానికి ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వ‌ర్ధంతి సంద‌ర్భంగా, విజ‌య‌న‌గ‌రంలో ఎంఎల్ఏ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి ఏర్పాటు చేసిన మెగా ప్లాంటేష‌న్ కార్య‌క్ర‌మాన్ని గురువారం మంత్రి ప్రారంభించారు. ధ‌ర్మ‌పురి మంచినీటి కోనేరువ‌ద్ద మొక్క‌లు నాటి, చెరువు సుంద‌రీక‌ర‌ణ ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టారు.

         ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ, ఏ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం కావాలన్నా ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం తప్ప‌నిస‌రి అని స్ప‌ష్టం చేశారు. మొక్క‌ల‌ను వేయ‌డ‌మే కాకుండా, వాటిని సంర‌క్షించే బాధ్య‌త‌ను ప్ర‌జ‌లు తీసుకోవాల‌ని సూచించారు.  ప‌రిశుభ్ర‌త‌ను సాధించేందుకు  త్వ‌ర‌లో రాష్ట్ర‌వ్యాప్తంగా ఒక భారీ కార్య‌క్రమాన్ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి ప్రారంభించ‌నున్నార‌ని తెలిపారు. ధ‌ర్మ‌పురి ప్రాంత ప్ర‌జ‌ల దాహార్తిని తీర్చ‌డానికి రూ.2కోట్ల‌తో త్రాగునీటి ప‌థ‌కాన్ని నిర్మించ‌నున్న‌ట్లు వెళ్ల‌డించారు. గ్రామంలో డ్రైనేజీ వ్య‌వ‌స్థ ఏర్పాటుకు సిద్దంగా ఉన్నామ‌ని, దానికి ప్ర‌జ‌ల‌నుంచి సంపూర్ణ స‌హ‌కారం కావాల‌ని కోరారు. దీనికోసం ఒక క‌మిటీని ఏర్పాటు చేసుకొని ముందుకు రావాల‌ని సూచించారు. క‌త్తిసాము, క‌ర్ర‌సాము లాంటి యుద్ద‌విద్య‌ల‌ అభివృద్ది కేంద్రాన్ని వీలైనంత త్వ‌ర‌లో ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

            ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి, అధికారం చేప‌ట్టిన కొద్ది కాలంలోనే, సంక్షేమ కార్య‌క్ర‌మాల అమ‌ల్లో తండ్రిని మించిన త‌న‌యుడిగా పేరుతెచ్చుకున్నార‌ని కొనియాడారు. దేశంలోనే ఆద‌ర్శ‌వంత‌మైన స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను ప్ర‌వేశ‌పెట్టి, ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకొని, ప‌రిష్క‌రించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిన ఘ‌న‌త మ‌న సిఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డికి ద‌క్కింద‌న్నారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆశ‌యాల సాధ‌న‌కు ప్ర‌తీఒక్క‌రూ పున‌రంకితం కావాల‌ని మంత్రి పిలుపునిచ్చారు.

            క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి మాట్లాడుతూ, నాయ‌కులు ఇచ్చిన పిలుపున‌కు స్పందించి, మంచినీటి కోనేటిని అభివృద్ది చేసుకొనేందుకు ముందుకు వ‌చ్చిన ధ‌ర్మ‌పురి గ్రామ‌స్తుల‌ను అభినందించారు. ఇదే స్ఫూర్తితో జిల్లా అంత‌టా మొక్క‌ల‌ను నాటడ‌మే కాకుండా, భూగ‌ర్భ జ‌లాల‌ను పెంచేందుకు ఇంకుడు గుంత‌ల‌ను నిర్మించాల‌ని సూచించారు. ధ‌ర్మ‌పురి గ్రామంలో శ‌త‌శాతం వేక్సినేష‌న్ పూర్తికావాల‌ని, బాల‌బాలిక‌లంద‌రినీ త‌ప్ప‌నిస‌రిగా బ‌డికి పంపించాల‌ని, గ‌ర్భిణుల‌కు ఇవ్వాల్సిన పోష‌కాల‌ను పూర్తిగా అందించాల‌ని క‌లెక్ట‌ర్‌ కోరారు.

            ఎంఎల్ఏ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి మాట్లాడుతూ, విజ‌య‌న‌గ‌రంలో గ‌త రెండు నెల‌లుగా మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాన్ని ఒక య‌జ్ఞంలా చేస్తున్నామ‌ని అన్నారు. కేవ‌లం మొక్క‌ల‌ను నాటి వ‌దిలేయ‌కుండా, వాటిని సంర‌క్షించే బాధ్య‌త‌ను స్థానికుల‌కే అప్ప‌గించ‌డం ద్వారా, వాటి పోష‌ణ‌కు ఇబ్బంది లేకుండా చ‌ర్య‌ల‌ను తీసుకున్నామ‌ని చెప్పారు. త్వ‌ర‌లో అపార్ట్‌మెంట్ ప్లాంటేష‌న్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తున్నామ‌ని, ప్ర‌తీ అపార్టుమెంట్‌లో విరివిగా మొక్క‌ల‌ను నాట‌నున్నామ‌ని తెలిపారు.  వైఎస్ఆర్ వ‌ర్థంతిని పుర‌స్క‌రించుకొని, నియోజ‌క‌వ‌ర్గంలో ఒకేరోజు సుమారు 15వేల మొక్క‌ల‌ను నాటుతున్నామ‌ని చెప్పారు. త‌న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌తో వైఎస్ఆర్ ఎంద‌రికో ఆద‌ర్శ‌నీయంగా నిలిచార‌ని, ఆయ‌న కుమారుడు, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి, తండ్రిని మించిన త‌న‌యుడిగా పేరు తెచ్చుకున్నార‌ని ఎంఎల్ఏ కొనియాడారు.

            మంత్రి, ఇత‌ర అతిధుల‌కు క‌ర్ర‌సాము, ఇత‌ర సంప్ర‌దాయ ప‌ద్ద‌తుల్లో, ధ‌ర్మ‌పురి గ్రామ‌స్తులు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు.   ఈ కార్య‌క్ర‌మంలో విజ‌య‌న‌గ‌రం మేయ‌ర్ వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మి, రాష్ట్ర గిరిజ‌న కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ శోభా స్వాతిరాణి, ఛీఫ్‌ క‌న్జ‌ర్వేజట‌ర్ పి.రామ్మోహ‌న‌రావు, డిఎఫ్ఓ స‌చిన్ గుప్త‌, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎస్ఎస్ వ‌ర్మ‌, తాశీల్దార్ ఎం.ప్ర‌భాక‌ర‌రావు,  కార్పొరేట‌ర్ పి.గ‌ణ‌ప‌తిరావు, స్థానిక నాయ‌కులు అప్పారావు మాష్టారు, ప‌లువురు కార్పొరేట‌ర్లు, ఎంఇ కిల్లాన దిలీప్ త‌దిత‌ర‌ మున్సిప‌ల్ అధికారులు పాల్గొన్నారు.