ప్రపంచంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం ఉదయం జరిగిన బాలకాండలోని ప్రథమ, ద్వితీయ సర్గలలో ఉన్న మొత్తం 143 శ్లోకాలను వేద పండితుల అఖండ పారాయణంతో సప్తగిరులు మార్మోగాయి. బాలకాండ పారాయణ కార్యక్రమం నిర్వహిస్తున్న ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆధ్యాపకులు ఆచార్య ప్రవా రామక్రిష్ణ సోమయాజులు మాట్లాడుతూ మన పూర్వీకులు మనకు అందించిన దివ్య శక్తి మంత్రోచ్ఛరణ అని, దీనితో సమస్త రోగాలను నయం చేయవచ్చని తెలిపారు. ప్రపంచ శాంతి, కరోనా మూడవ వేవ్ చిన్న పిల్లలను ఇబ్బంది పెడుతుందని ప్రభుత్వాలు, వైద్య సంస్థలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో పిల్లలు, పెద్దలు అన్ని వర్గలవారు సుఖశాతంతులతో ఉండాలని బాలకాండ పారాయణం నిర్వహస్తున్నట్లు చెప్పారు. బాలకాండ ప్రథమ, ద్వితీయ సర్గల్లోని మొత్తం 143 శ్లోకాలను, విషూచికా మహమ్మరి నివారణ మంత్ర పారాయణం ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారంలో కోట్లాది మంది ప్రజలు ఒకేసారి పారాయణం చేస్తే ఫలితం అనంతంగా ఉంటుందన్నారు. దీనిని పారాయణం చేయడం వలన ఆరోగ్యం, సుఖం, శాంతి, విద్యా, ఐశ్వర్యం సిద్ధిస్తాయని వివరించారు.
ఆచార్య ప్రవా రామక్రిష్ణ సోమయాజులు పర్యవేక్షణలో డా.కోగంటి రామానుజాచార్యులు, శ్రీ ఇంద్రకంటి సత్య కిషోర్ పారాయణం చేశారు. అఖండ పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేద అధ్యాయన సంస్థకు చెందిన వేద పారాయణ దారులు, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంకు చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్నారు. ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీమతి వందన బృందం " రామరామ జయ రాజ రామ్.. రామరామ జయ సీతా రామ్ ", అనే సంకీర్తనను కార్యక్రమం ప్రారంభంలో, " శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ కపివర బహుబలవాన్ " అనే సంకీర్తనను కార్యక్రమం ముగింపులో సుమధురంగా అలపించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి, టిటిడి వైఖానస ఆగమ సలహాదారు మోహనరంగాచార్యులు, శ్రీవారి ఆలయ ఒఎస్‌డి పాల శేషాద్రి పాల్గొన్నారు.