కోడి రామ్మూర్తి స్టేడియం సత్వరమే పూర్తిచేయాలి..
Ens Balu
2
శ్రీకాకుళం
2020-09-08 21:59:30
శ్రీకాకుళం జిల్లాలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణపు పనులను త్వరలోనే పూర్తిచేస్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ హామీ ఇచ్చారు. మంగళవారం ఉదయం స్థానిక కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణ పనులను ఉపముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ,అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దిన ఘన చరిత్ర ఈ స్టేడియంకు ఉందని, జిల్లాలోనే ఎంతో ప్రాముఖ్యత ఉన్న స్టేడియం ఇదని మంత్రి గుర్తుచేసారు. ఒక జాతీయస్థాయి వాలీబాల్ క్రీడాకారుడిగా క్రీడాకారుల సమస్యలు తనకు తెలుసునని అన్నారు.ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష హోదాలో ఎప్పటికపుడు క్రీడా సంఘాలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటున్నానని తెలిపారు. రూ.15 కోట్లతో కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణం పనులు జరుగుతున్నాయని, ఊడా నుండి విడుదల కావలసిన నిధుల జాప్యం కారణంగా నిర్మాణ పనులు ఆలస్యం జరుగుతున్నట్లు గుర్తించామని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. ఊడా కాస్త సుడాగా మారడం వలనే నిధుల జాప్యానికి కారణమయిందని, త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. స్టేడియం నిర్మాణానికి సంబంధించి నిధుల సమస్య లేదని, అసంపూర్తిగా ఉన్న స్టేడియం పనులన్నింటినీ త్వరలోనే పూర్తిచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు యోచిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె. నివాస్, సెట్ శ్రీ సిఇఓ జి. శ్రీనివాసరావు, జిల్లా చీఫ్ కోచ్ బి.శ్రీనివాసకుమార్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి పి.సుందరరావు, వాకర్స్ క్లబ్ సభ్యులు జి.ఇందిరాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.