తాశీల్దార్‌పై దాడి చేసిన‌వారిపై చ‌ర్య‌లు..


Ens Balu
2
Vizianagaram
2021-09-03 09:15:13

విజ‌య‌న‌గ‌రంజిల్లా  మ‌క్కువ తాశీల్దార్ వీర‌భ‌ద్ర‌రావు, ఇత‌ర రెవెన్యూ సిబ్బందిపై దాడికి పాల్ప‌డిన వ్యక్తుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి తెలిపారు. విధులు నిర్వ‌ర్తిస్తున్న మ‌క్కువ‌ తాశీల్దార్‌, ఆర్ఐ, విలేజ్ స‌ర్వేయ‌ర్‌, మ‌హిళా పోలీసుపై కొంద‌రు వ్య‌క్తులు రెండు రోజుల క్రితం దాడికి పాల్ప‌డిన సంఘ‌ట‌న‌పై, క‌లెక్ట‌ర్ స్పందించారు. వారిపై క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేసి, క‌ఠిన చ‌ర్య‌ల‌ను తీసుకోవాల‌ని,  ఇలాంటి సంఘ‌ట‌న పున‌రావృతం కాకుండా చూడాల‌ని, జిల్లా ఎస్‌పిని కోరిన‌ట్లు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. కాగా మ‌క్కువ తాశీల్దార్ డి.వీర‌భ‌ద్ర‌రావు, ఇత‌ర రెవెన్యూ సిబ్బందిపై జ‌రిగిన దాడిని, జిల్లా రెవెన్యూ అసోసియేష‌న్ తీవ్రంగా ఖండించింది. తాశీల్దార్‌, ఇత‌ర ఉద్యోగుల‌కు, రెవెన్యూ అసోసియేష‌న్ అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు టి.గోవింద‌, గొట్టాపు శ్రీ‌రామ్మూర్తి, కోశాధికారి ర‌మ‌ణ‌రాజు త‌మ సంఘీభావాన్ని తెలిపారు. అవ‌స‌ర‌మైతే జిల్లాలోని తాశీల్దార్లు అంద‌రూ, రెవెన్యూ ఉద్యోగులంతా క‌లిసి మ‌క్కువ వెళ్లి వారికి అండ‌గా నిలిచేందుకు సిద్దంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు. ఇటువంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చూడాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్, ఎస్‌పిల‌ను కోరిన‌ట్లు వారు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.