సైనిక పాఠశాలలో నేడు స్వర్ణ విజయ వర్ష్..
Ens Balu
3
Vizianagaram
2021-09-03 16:53:55
కోరుకొండ సైనిక పాఠశాలలో స్వర్ణిమ్ విజయ్ వర్ష్ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 1971 యుద్దంలో భారతదేశం పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, స్వర్ణోత్సవాలను మన దేశం ఘనంగా జరుపుకుంటోంది. ఈ వేడుకలను 2020 డిసెంబరు 16న మన ప్రభుత్వం ప్రారంభించి, ఈ ఏడాది డిసెంబరు 16 వరకు నిర్వహించనుంది. ఈ అపూర్వ విజయానికి చిహ్నమైన విక్టరీ టార్చ్ జిల్లాకు విచ్చేయనుంది. 1971 యుద్దంలో అసువులు బాసిన అమర వీరుల గ్రామాలను పునీతం చేస్తూ, తిరిగి డిసెంబరు 16 నాటికి ఈ టార్చ్ ఢిల్లీ చేరుకుంటుంది. దీనిలో భాగంగా జిల్లాకు విచ్చేయుచున్న ఈ విజయ కాగడాకు, ఉదయం 8.30 గంటలకు సైనిక పాఠశాల ప్రిన్సిపాల్ అరుణ్ ఎం కులకర్ణి ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు యుద్దవీరులు, యుద్దవీరులను కోల్పోయిన వీరనారులు, ప్రభుత్వ అధికారులు, పాఠశాల పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొంటారు.