కోవిడ్ మూడో దశకు సంబంధించి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సి. హరికిరణ్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు పొంచి వుందన్న అంచనాల నేపథ్యంలో జీజీహెచ్ లో అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా పీడియాట్రిక్ వార్డు, చైల్డ్ కేర్ యూనిట్లలో ప్రత్యేక దృష్టి పెట్టి అవసరమైన ఆక్సిజన్ పడకలు, చిన్న పిల్లలకు వినియోగించే వెంటిలేటర్స్, సాధారణ పడకలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ థర్డ్ వేవ్ సన్నద్ధతలో భాగంగా జీజీహెచ్ లో గైనిక్, పీడియాట్రిక్ ,చైల్డ్ కేర్ యూనిట్, జీఐసీయు, నూతన పీడియాట్రిక్ ట్రయాజ్, నిర్మాణంలో ఉన్న ఎంసియు వార్డులలో ఏర్పాట్లను ఈ సందర్భంగా కలెక్టర్ హరికిరణ్ పరిశీలించి, వైద్య అధికారులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా వివిధ వార్డులలో చికిత్స పొందుతున్న చిన్నపిల్లల తల్లులతో కలెక్టర్ మాట్లాడి, ఆస్పత్రులలో పిల్లలకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్శనలో కలెక్టర్ వెంట కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. ఆర్ మహాలక్ష్మి, ఆర్.ఎమ్.వో డా.గిరిధర్, ఇతర వైద్య అధికారులు, పాల్గొన్నారు.