విజయనగరం జిల్లాలోని వాటర్ ప్లాంట్ల నిర్వహణపై దృష్టి పెట్టాలని, జాయింట్ కలెక్టర్(ఆసరా)జె.వెంకటరావు ఆదేశించారు. వాటర్ ప్లాంట్లకు అనుమతులు, నిర్వహణతో ముడిపడి ఉన్న వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి వెంకటరావు మాట్లాడుతూ, జిల్లాలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించే వాటర్ ప్లాంట్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం జిల్లా మొత్తంమీద 8 వాటర్ ప్లాంట్లకు మాత్రమే ప్రభుత్వ పరంగా అన్నిరకాల అనుమతులూ ఉన్నాయని చెప్పారు. అనుమతులు లేని 24 ప్లాంట్లను మూసివేయడం జరిగిందని చెప్పారు. అయితే జిల్లా అవసరాలను దృష్టిలో పెట్టుకొని, ఈ ప్లాంట్లు ప్రభుత్వం నుంచి అన్ని రకలా అనుమతులను తెచ్చుకొనేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని సంబంధిత శాఖలకు సూచించారు. ఈ నెల 8న వాటర్ ప్లాంట్ యజమానులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, వారికి అవసరమైన మార్గదర్శకాలను, ప్రభుత్వ నిబంధనలను, ధరఖాస్తు చేసే విధానాన్ని వివరించాలని జెసి ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, ఆర్‌డిఓ బిహెచ్ భవానీ శంకర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.