రైతుల అవసరాల మేరకు జిల్లా అధికారులు నివేదించిన కోటా ప్రకారం ఎరువులు సరఫరా చేయాలని, త్వరితగతిన సరకు తెప్పించాలని వివిధ కంపెనీల ప్రతినిధులను జేసీ కిశోర్ కుమార్ కోరారు. ఇండెంట్ ప్రకారం కంపెనీలు ఎరువులను సరఫరా చేయకపోవటం వల్ల ఇబ్బందులు తలెత్తున్నాయని పేర్కొన్నారు. ఎరువుల సమస్యను తీవ్రంగా పరిగణించి కంపెనీల ప్రతినిధులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఖరీఫ్ మొదలైన క్రమంలో ఎరువుల అందుబాటు, సరఫరా, నిల్వలు తదితర అంశాలపై సమీక్షించేందుకు గాను సోమవారం తన ఛాంబర్‌లో జేసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు రాకుండా ఎరువులు అందజేయాల్సిన బాధ్యత ఇటు అధికారులు, అటు కంపెనీల ప్రతినిధులపై ఉందని పేర్కొన్నారు. జిల్లాలోని తాజా పరిస్థితిని యాజమాన్యాల దృష్టికి తీసుకెళ్లి అవసరమైన మేరకు యూరియా, డీఏపీ ఎరువులను త్వరితగతిన రప్పించాలని చెప్పారు. ఇదిలా ఉండగా ఈ నెల రెండో వారం లోపు 2550 టన్నుల యూరియా, 1000 టన్నుల డీఏపీ రానుందని కంపెనీల ప్రతినిధులు చెప్పారు. అవసరం ఉన్న సమయంలో స్పందించి ఎరువులు తెప్పించాల్సిన బాధ్యత ప్రతీ కంపెనీపైనా ఉందని ఈ సందర్భంగా జేసీ పేర్కొన్నారు. నిర్ణీత సమయంలో ఎరువులను సరఫరా చేయని కంపెనీల యాజమాన్యాలకు లేఖలు రాయాలని వ్యవసాయ శాఖ అధికారులను జేసీ ఆదేశించారు.
హోల్ సేలర్స్, డీలర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, ప్రభుత్వం సూచించిన ధరలకే ఎరువులను విక్రయించాలని ఆదేశించారు. వ్యాపారులు వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం వ్యవహరించాలని సూచించారు. అధిక ధరలకు విక్రయించినా.. నిబంధనలు అతిక్రమించినా చర్యలు తప్పవని జేసీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ ఆశాదేవి, డీడీ ఆనందరావు, వివిధ ఎరువుల కంపెనీల ప్రతినిధులు ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.