విజయనగరం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన సానుకూల వాతావరణం కల్పిస్తామని, పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే వారికి జిల్లా యంత్రాంగం ద్వారా త్వరగా అవసరమైన అనుమతులు మంజూరుచేసి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి చెప్పారు. పారిశ్రామిక వేత్తలు తమ సమస్యలను తెలియజేస్తే వాటిని తమ స్థాయిలో వున్న వాటిని వెంటనే పరిష్కరించేందుకు సిద్ధంగా వున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా స్థాయి పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సహక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి అధ్యక్షతన సోమవారం కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో జరిగింది. పరిశ్రమలు, కాలుష్య నియంత్రణ మండలి, విద్యుత్, గనులు, అగ్నిమాపక, పురపాలక, పంచాయతీరాజ్ శాఖలతో పాటు ఇతర శాఖలకు చెందిన అధికారులు, బ్యాంకు అధికారులు జిల్లాలోని పలువురు పారిశ్రామిక వేత్తలు, యాజమాన్య ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పారిశ్రామిక వేత్తలు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని ఒక వేదికగా వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. వివిధ పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు పరిశ్రమలకు అందించాల్సిన ప్రోత్సాహకాలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషిచేస్తామని కలెక్టర్ చెప్పారు.
ఈ సందర్భంగా జిల్లాలో పారిశ్రామిక రాయితీల కోసం వచ్చిన 44 దరఖాస్తుల్లో రెండు మినహా 42 దరఖాస్తుల్లో ఆయా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి రూ.1.67 కోట్ల రాయితీల కోసం సిఫారసు చేస్తూ సమావేశంలో నిర్ణయించారు. పరిశ్రమల ఏర్పాటు కోసం అనుమతుల మంజూరుకోసం వచ్చిన దరఖాస్తుల్లో పెండింగులో వున్న 14 దరఖాస్తులపై కలెక్టర్ సమీక్షించి, కాలుష్య నియంత్రణ వంటి శాఖల అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పరిశ్రమల ఏర్పాటుకోసం వచ్చిన దరఖాస్తుల్లో 8 దరఖాస్తులు తిరస్కరణకు గురికాగా వాటికి గల కారణాలపై ఆరా తీశారు. దరఖాస్తు చేసిన వారు ఏవైనా డాక్యుమెంట్లు సమర్పించాల్సి వస్తే వారికి తగిన అవగాహన కల్పించి వారు వాటిని సమకూర్చుకునేలా వారికి సంబంధిత శాఖలు సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
చిన్నపరిశ్రమలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ అధికారి జివిఆర్ నాయుడు మాట్లాడుతూ జిల్లాలో పది రకాల పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని తమ శాఖ గుర్తించిందని పేర్కొన్నారు. మామిడి తాండ్ర, జీడి, రైస్ మిల్లులు, గ్రానైట్ ఉత్పత్తులు, జనరల్ ఇంజనీరింగ్, కాయిర్, చేనేత జౌళి సంబంధ పరిశ్రమలు, సంగీత వాద్య పరికరాలు, తేనె, చింతపండు ప్రాసెసింగ్, కూరగాయలు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటుకు జిల్లాలో సానుకూల పరిస్థితులు వున్నట్లు చెప్పారు.
ఈ రంగాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకు వచ్చినట్లయితే జిల్లా యంత్రాంగం ప్రోత్సహిస్తుందని జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు చెప్పారు.
జిల్లాలో రాష్ట్ర పారిశ్రామిక మౌళిక వసతుల సంస్థ వద్ద పరిశ్రమల ఏర్పాటుకోసం కేటాయించేందుకు 625 ఎకరాల భూములు సిద్ధంగా వున్నాయని ఏపిఐఐసి జోనల్ మేనేజర్ ఆర్.పాపారావు వివరించారు. బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో 383 ఎకరాలు, రామభద్రపురం సమీపంలోని కొట్టక్కి వద్ద అభివృద్ధి చేయని 187 ఎకరాల భూములు, భోగాపురం మండలం కొంగవానిపాలెం వద్ద అభివృద్దిపరచని 12.37 ఎకరాలు, కొత్తవలస మండలం బలిఘట్టం వద్ద 43 ఎకరాలు ఎం.ఎస్.ఎం.ఇ. పార్కు కోసం సిద్దంగా వున్నట్టు చెప్పారు.
ఈ సందర్భంగా పలువురు పరిశ్రమల ప్రతినిధులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్‌కు వివరించారు. డెక్కన్ ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమ ఎం.డి., రాష్ట్ర ఫెర్రో ఎల్లాయిస్ ఉత్పత్తి దారుల సంఘం ఉపాధ్యక్షుడు పి.ఎస్.ఆర్.రాజు మాట్లాడుతూ తమ పరిశ్రమలకు విద్యుత్ రాయితీలే కీలకమని, 2014 నుంచి తమకు విద్యుత్ సరఫరాకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు విడుదల చేసి తమ పరిశ్రమలను ఆదుకోవాలని కోరారు. జిల్లాలో 16 యూనిట్లకు గాను 12 పరిశ్రమలే ప్రస్తుతం నడుస్తున్నాయని, వాటిని కొనసాగించేందుకు రాయితీలను విడుదల చేయడం తక్షణావసరమని పేర్కొన్నారు.
జూట్ పరిశ్రమకు ప్రకటించిన రాయితీల్లో రెండు రోజుల క్రితం కొంతమేరకు ప్రభుత్వం విడుదల చేసిందని, మిగిలినవి కూడా వెంటనే విడుదల చేయాలని ఆ పరిశ్రమల తరపున హాజరైన సునీల్ బవారియా కోరారు.
పరిశ్రమలకు ఫిక్స్‌డ్ చార్జీల నుంచి మినహాయింపు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, అయితే ఆ ఆదేశాలు ఇంకా అమలు కాలేదని, వాటిని వెంటనే అమలుచేసి చిన్నపరిశ్రమలకు ఊరట కల్పించాలని చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి రామలింగస్వామి కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం దళిత పారిశ్రామిక వేత్తలకోసం జగనన్న బడుగు వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని, ఈ పథకం అమలులో భాగంగా ఔత్సాహికులైన దళిత పారిశ్రమిక వేత్తలకు అవగాహన కల్పించేందుకు వెంటనే ఒక అవగాహన సదస్సు నిర్వహించాలని డిక్కీ(దళిత పారిశ్రామిక వేత్తల సంఘం) ప్రతినిధి కోరారు.
జిందాల్ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ ఎస్.కోట మండలంలో తమ పారిశ్రామిక సంస్థకు మంజూరు చేసిన 1168 ఎకరాల్లో చిన్నపరిశ్రమల పార్కును ఏర్పాటు చేస్తున్నట్టు ఆ సంస్థ ప్రతినిధి వివరించారు. డిసెంబరు 2023 నాటికి 2000 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చేలా చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఈ పార్కులో పరిశ్రమల ఏర్పాటుకోసం అవసరమైన అనుమతులు వెంటనే మంజూరు చేయాలని కోరారు.
సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జి.ఎం.శ్రీధర్., జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు, ఎల్.డి.ఎం. శ్రీనివాసరావు, సాంఘిక సంక్షేమ డి.డి. సునీల్ రాజ్ కుమార్, అగ్నిమాపక శాఖ అధికారి జె.మోహనరావు, భూగర్భ జలశాఖ ఏ.డి. రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.