ప్రధానంగా విద్య, వైద్య రంగాలపై దృష్టిసారించడంతో పాటు ప్రభుత్వ ప్రాధాన్య పథకాలు, కార్యక్రమాల అమల్లో జిల్లాను ముందు నిలిపేందుకు కృషిచేయనున్నట్లు జిల్లా కలెక్టర్ చేవూరి హరికిరణ్ పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని కోర్టుహాల్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో జరిగిన కాఫీ విత్ కలెక్టర్ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ హరికిరణ్ పాత్రికేయులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా అభివృద్ధి, సంక్షేమం పరంగా ప్రాధాన్య కార్యక్రమాలను, ప్రణాళికలను కలెక్టర్ వివరించారు. గ్రామాల్లో సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, డిజిటల్ లైబ్రరీలు ఇలా వివిధ ప్రభుత్వ ప్రాధాన్య శాశ్వత భవన నిర్మాణాల ద్వారా సంపద సృష్టితో పాటు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవల పంపిణీ సజావుగా జరుగుతోందని పేర్కొన్నారు. వ్యవసాయ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని పంట కాల్వలు, డ్రెయిన్ల ఆధునికీకరణకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. అప్ ల్యాండ్ ప్రాంతంలో కొత్తగా ఆయకట్టు స్థిరీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అదే విధంగా ఏలేరు, తాండవ అనుసంధానంపైనా కసరత్తు జరుగుతోందని వివరించారు. ముంపు సమస్య అధికంగా ఉన్న ప్రాంతాల్లో డ్రెయిన్లలో డీసిల్టింగ్, డ్రెడ్జింగ్ వంటి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం అమల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషిచేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న రూ.1,80,000కు అదనంగా స్వయం సహాయక సంఘాల లింకేజీ రుణాల కింద మరో రూ.50,000 ఆర్థిక సహాయం అందేలా చూస్తున్నామన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో రహదారులు, వంతెనలు తదితరాలకు సంబంధించి మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ప్రధానమని, అనుమతుల మేరకు వీటిపై దృష్టిసారించనున్నట్లు వివరించారు. ప్రకృతి సౌందర్యానికి నిలయమైన జిల్లాను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశముందని, మారేడుమిల్లి, కోనసీమ ప్రాంతాల్లో రహదారులు, నీటి సౌకర్యాలు కల్పిస్తే చాలు.. మరిన్ని రిసార్టుల ఏర్పాటుకు చాలామంది సిద్ధంగా ఉన్నారన్నారు. జిల్లాలో ఆయిల్, గ్యాస్, మత్స్య తదితర రంగాల్లో ప్రముఖ పారిశ్రామిక సంస్థలు ఉన్నాయని.. కార్పొరేట్ సామాజిక బాధ్‌ాత (సీఎస్ఆర్) ద్వారా ఈ సంస్థలను జిల్లా అభివృద్ధి కార్యాచరణలో భాగస్వాములను చేయడంపై దృష్టిసారిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. పారిశ్రామికంగానూ జిల్లాను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఏడెనిమిది ఇసుక డిపోల్లో 5-6 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉందని, ఇసుక సరఫరాకు ఆటంకం లేకుండా చూస్తున్నట్లు వెల్లడించారు. బోట్స్‌మెన్ సొసైటీలకు కూడా అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు.
ఆసుపత్రుల్లో మౌలిక వసతుల అభివృద్ధి
కోవిడ్ మ్యుటేషన్స్ నేపథ్యంలో సన్నద్ధతా చర్యల్లో భాగంగా జిల్లాలో ఆసుపత్రులను మౌలిక వసతుల పరంగా అభివృద్ధి చేస్తున్నామని, పీఎస్ఏ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. రోజుకు అయిదు వేల నుంచి ఆరువేల వరకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం కాకినాడలో ఉన్న వీఆర్‌డీఎల్ ల్యాబ్‌కు అదనంగా రాజమహేంద్రవరం, అమలాపురంలోనూ ల్యాబ్‌లు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. రంపచోడవరంలోనూ ల్యాబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. పోలవరం నిర్వాసిత ప్రాంతాల్లో ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో ఇళ్ల నాణ్యతపైనా దృష్టిసారిస్తున్నామని, థర్డ్‌పార్టీ డిపార్ట్‌మెంట్‌తో నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేయనున్నట్లు వివరించారు. నిర్వాసిత గ్రామాల సర్పంచ్‌ల భాగస్వామ్యంతో ప్రాజెక్టు లెవెల్ మానిటరింగ్ కమిటీ (పీఎల్ఎంసీ)ని ఏర్పాటు చేశామని, ఈ నెల 17న కమిటీ తొలి సమావేశం జరగనుందని కలెక్టర్ ప్రకటించారు.
పాత్రికేయుల సమస్యలపై దృష్టి
సమావేశంలో వివిధ మీడియా సంస్థల ప్రతినిధులు.. ఇళ్ల స్థలాలు, ప్రమాద బీమా, కోవిడ్ కారణంగా మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం, అక్రిడిటేషన్లు తదితర అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. జిల్లాలో పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి కృషిచేయనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా మరణించిన పాత్రికేయ కుటుంబాల సంక్షేమానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జిల్లాలో 2021-2022 ద్వైవార్షిక కాలానికి జిల్లాలో వివిధ ప్రింట్, ఎలక్ట్రానిక్, న్యూస్ ఏజెన్సీ మీడియా సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 555 మంది అర్హులైన జర్నలిస్ట్ లకు మీడియా అక్రిడిటేషన్లు జారీ చేసామని జిల్లా కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ జి.ఓ నెం.142లోని నిర్థేశాల ప్రకారం గత డిశంబరు నెలలో జరిగిన జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో 261 మంది జర్నలిస్ట్ లకు అక్రిడిటేషన్లు జారీ చేయగా, ఈ నెల 3వ తేదీన జరిగిన కమిటీ సమావేశంలో మరో 294 మందికి అక్రిడిటేషన్లు జారీ చేసామని ఆయన తెలియజేశారు. సమావేశంలో ప్రింట్, ఎలక్ట్రానిక్, న్యూస్ ఏజెన్సీల జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు.