విజయనగరం జిల్లాలో వివిధ ప్రాజెక్టులకోసం సేకరిస్తున్న భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి ఆదేశించారు. భూసేకరణకు సంబంధించి, రెవెన్యూ, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, అటవీ, విద్యుత్ తదితర శాఖల అధికారులతో కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నిర్ణీత కాలవ్యవధిని పెట్టుకొని భూసేకరణ పూర్తి చేయాలన్నారు. మూడో రైల్వేలైన్, తోటపల్లి, తారకరామతీర్ధసాగర్, ఆర్ ఓ బి, డంపింగ్ యార్డు, జాతీయ రహదారులకు సేకరిస్తున్న భూములకు సంబంధించి, ప్యాకేజీలవారీగా సమీక్షించారు. వాటి స్థితిని తెలుసుకున్నారు. పనిలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే సహించేది లేదని, యుద్దప్రాతిపదికన భూసేకరణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జిసి కిశోర్ కుమార్, పార్వతీపురం సబ్ కలెక్టర్ భావన, డిఆర్ఓ ఎం.గణపతిరావు, భూసేకరణ స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.