ప్రభుత్వం వివిధ వర్గాల వారికోసం ఉద్దేశించి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆయా వర్గాలకు చెందిన అర్హులైన వారికి సక్రమంగా, సత్వరం అందించేందుకు సచివాలయ ఉద్యోగులు కృషిచేయాలని జాయింట్ కలెక్టర్(గ్రామ, వార్డు సచివాలయాలు) డా.ఆర్.మహేష్ కుమార్ అన్నారు. సచివాలయాల ద్వారా గ్రామీణ ప్రజలకు అత్యుత్తమ సేవలందించి ఉద్యోగులు వారి అభిమానం పొందాలన్నారు. డెంకాడ, భోగాపురం మండలాల్లో జాయింట్ కలెక్టర్ డా.మహేష్ కుమార్ బుధవారం పర్యటించి పలు గ్రామ సచివాలయాలను తనిఖీ చేశారు. డెంకాడ మండలం శింగవరం, డెంకాడ మండల కేంద్రం, భోగాపురంలో గ్రామ సచివాలయాలను జె.సి తనిఖీ చేశారు. సచివాలయంలో రికార్డులు, రిజిష్టర్లను పరిశీలించారు. సచివాలయానికి వచ్చే వినతుల పరిష్కారం ఏవిధంగా చేస్తున్నదీ ఆరా తీశారు. ప్రజల నుంచి వివిధ సేవల నిమిత్తం వచ్చే వినతులను జాప్యం లేకుండా తక్షణం పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆధార్ నమోదుపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలను లబ్దిదారులకు సక్రమంగా అందిస్తున్నదీ లేనిదీ తెలుసుకున్నారు. అర్హులైన వారికే పథకాలు అందించాలని స్పష్టంచేశారు. సచివాలయ సిబ్బంది పనివేళల్లో ప్రజలకు అందుబాటులో వుంటూ గ్రామస్థుల సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. గ్రామ స్థాయిలో పరిష్కారం సాధ్యం కానట్లయితే వారు ఏ కార్యాలయానికి వెళ్తే పరిష్కారం జరుగుతుందో ప్రజలకు మార్గదర్శనం చేయాలన్నారు.