త్వరితగతిన రోడ్డు పనులు పూర్తి చేయాలి..
Ens Balu
1
Anantapur
2021-09-08 10:39:37
అనంతపురం నగరంలో పెండింగులో ఉన్న రోడ్లు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మేయర్ మహమ్మద్ వసీం సూచించారు. నగరంలోని టీటీడీ కల్యాణ మండపం రైల్వే గేటు నుంచి తపోవనం సర్కిల్ వరకు 80 లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న బీటీ రోడ్ పనులను మేయర్ బుధవారం పరిశీలించారు. పనులలో జాప్యం వల్ల నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డు గతుకులమయంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ప్రజాప్రతినిధులు మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనితో ఈ ఈ రామ్మోహన్ రెడ్డితో కలసి మేయర్ వసీం పనులను పరిశీలించారు.టీటీడీ కల్యాణ మండపం రైల్వే గేటు నుంచి తపోవనం సర్కిల్ వరకు గుంతలు ఎక్కువగా ఉన్నందున పటిష్టంగా రోడ్ పనులు చేపట్టాలని,అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేయాలని అధికారులకు మేయర్ సూచించారు. అంతేకాకుండా వర్షాల వల్ల నగరంలో దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మేయర్ ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు శేఖర్ బాబు, శ్రీనివాసులు , అనిల్ కుమార్ రెడ్డి, నాయకులు రామచంద్ర , డి ఈ నరసింహులు, కాంట్రాక్టర్ రఘునాథ్ రెడ్డి, ప్లానింగ్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.