జీవ వైవిధ్యాన్ని (బయో డైవర్సిటీ) పరిరక్షించడంలో భాగంగా జిల్లాలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో బయోడైవర్సిటీ పార్కు ఏర్పాటుకు ప్రణాళికాయుత చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ చేవూరి హరికిరణ్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడలో కలెక్టరేట్‌లో ఏపీ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు సభ్య కార్యదర్శి డా. నళినీ మోహన్‌తో కలిసి కలెక్టర్ హరికిరణ్.. జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డీఎఫ్‌వో (టెరిటోరియల్) ఐకేవీ రాజు, డీఎఫ్‌వో (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.శ్రీనివాస్ తదితరులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 7.13 ఎకరాల్లో ఏర్పాటుచేయనున్న బయోడైవర్సిటీ పార్కుకు సంబంధించి భూమి, ల్యాండ్‌స్కేప్ అభివృద్ధి, నిర్మాణాలు, ప్రాజెక్టు అంచనా వ్యయం, టెండర్ ప్రక్రియ, బయట నుంచి రహదారులు, అంతర్గత జీవ వనరుల పార్కులు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బయోడైవర్సిటీ పార్కులో సీతాకోక చిలుక, ఔషధ, ఆక్వాటిక్, ఫైకస్, ఆరోమాటిక్, గృహ వైద్య తదితర గార్డెన్లతో పాటు ఫుడ్‌కోర్టు, ఇంటర్‌ప్రెటేషన్, యోగా/మెడిటేషన్ సెంటర్, కిడ్స్ జోన్ వంటివి కూడా ఏర్పాటు కానున్నందున అటవీ, రెవెన్యూ, వర్సిటీ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రాజెక్టు విజయవంతంగా ప్రారంభమయ్యేందుకు కృషిచేయాలని అధికారులకు సూచించారు. ఏపీ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు అధికారుల మార్గనిర్దేశం, సహకారంతో దశల వారీగా పనులు చేపట్టాలన్నారు. ఇప్పటికే జిల్లాస్థాయి ప్రత్యేక బృందం భూ తనిఖీలు నిర్వహించినందున తర్వాత చేపట్టాల్సిన పనులపై దృష్టిసారించాలని సూచించారు. అదే విధంగా జిల్లాలో జీవ వైవిధ్య పరిరక్షణకు జీవ వైవిధ్య నిర్వహణ కమిటీ (బీఎంసీ)ల ద్వారా సమగ్ర కార్యాచరణ రూపొందించి, అమలుచేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. జంతువులు, పక్షులు, ప్రకృతి, పర్యావరణం తదితరాలకు సంబంధించిన నిపుణులను కూడా కమిటీల్లో చేర్చుతున్నట్లు తెలిపారు.
ఏపీ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు సభ్య కార్యదర్శి డా. నళినీ మోహన్ మాట్లాడుతూ ప్రజలు జీవ వైవిధ్యం ఆవశ్యకతపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు కృషి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. వివిధ విభాగాల మధ్య సమన్వయం, సహకారం; జీవ వైవిధ్య కార్యాచరణ అమలుకు గ్రామ, మండల స్థాయి కమిటీల సహకారం, ప్రజా భాగస్వామ్యం అవసరమని తెలిపారు. జిల్లాలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో బయోడైవర్సిటీ పార్కు.. ప్రజల్లో జీవవైవిధ్యంపై అవగాహన పెంపొందించేందుకు, విద్యార్థులు పరిశోధనలు చేసేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. జీవవైవిధ్య చట్టం-2002 అమలుకు రాష్ట్ర స్థాయిలో స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు కొత్త నమూనాలో పలు చర్యలు తీసుకుంటోందని, ఈ క్రమంలోనే బయోడైవర్సిటీ ప్రాజెక్టులను చేపడుతున్నట్లు నళినీ మోహన్ తెలిపారు. సమావేశంలో జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, కాకినాడ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ, ఆదికవి నన్నయ యూనివర్సిటీ డీన్ (సీడీసీ) ప్రొఫెసర్ ఎన్.కమలకుమారి; కాకినాడ రూరల్ ఎంపీడీవో, తహసీల్దార్ పి.నారాయణమూర్తి, వి.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.