సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా వ్యాపించకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలని జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. సృజన మలేరియా సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఆమె 4వ జోన్ 33 వార్డు పరిధిలో బంగారుమెట్ట పరిసర ప్రాంతాలలో పర్యటించి, డోర్ నెం. 31-34-99 ఇంటిలో 11 సంవత్సరాల భరత్ అనే బాలునకు డెంగ్యూ వ్యాధి నిర్ధారణ అయినందున ఆ ఇంటికి వెళ్లి బాలుని యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చుట్టు ప్రక్కల 200 మీటర్ల వరకు స్ప్రేయింగ్, ఫాగింగ్ చేయించాలని మలేరియా సిబ్బందిని ఆదేశించారు. దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రజలకు తెలపాలని, వర్షాలు పడుతున్నందున ఎక్కడా నీటి నిల్వలు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. వార్డులలో మలేరియాపై అవగాహన కల్పించే తనిఖీ స్టిక్కర్లు ను సరిగా పంపిణీ చేయని కారణంగా, బయాలజిస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మలేరియా స్టిక్కర్లును ప్రతి ఇంటికి అతికించాలని, ప్రతివారం ప్రతి ఇంటిని సందర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకొని సందర్శించినట్లు గోడపై స్టిక్కర్లు అంటించి, ఇంటి వారి వద్ద నుండి సంతకం పెట్టించుకోవలని ఆదేశించారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించినా సహించేదిలేదని మలేరియా సిబ్బందిని హెచ్చరించారు. ప్రతి మంగళవారం, శుక్రవారం “డ్రై డే” గా పాటించాలని ప్రజలకు తెలుపమని సూచించారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, నాల్గవ జోనల్ కమిషనర్ బి.వి.రమణ, కార్యనిర్వాహక ఇంజనీరు చిరంజీవి, శానిటరీ సూపర్వైజర్ శ్రీనివాస రాజ్, మలేరియా ఇన్స్పెక్టర్, శానిటరీ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.