ఉచిత విద్యుత్ తో రైతులకే ప్రయోజనం..డిప్యూటీ సీఎం


Ens Balu
4
Srikakulam
2020-09-09 20:38:56

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న వై.యస్.ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ నగదు బదిలీ పథకం రైతులకు ప్రయోజనకరమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ అన్నారు. వై.యస్.ఆర్.ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం - లబ్ధిదారుల ఖాతాలకు నగదు బదిలీపై అవగాహన సదస్సు బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది.అనంతరం మీడియా ప్రతినిధులకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప ముఖ్య మంత్రి ఉచిత వ్యవసాయ విద్యుత్ నగదు బదిలీ పథకం గూర్చి వివరించారు. ఈ పథకం రైతులకు ప్రయోజనకరమన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారని ఆయన చెప్పారు. వై.యస్.రాజశేఖర రెడ్డి ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొట్ట మొదటి సంతకం ఉచిత వ్యవసాయ విద్యుత్ దస్త్రంపై  పెట్టారన్నారు. ఈ పథకాన్ని బరింత బలోపేతం చేయుటకు ఆయన తనయుడు ప్రస్తుత ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి సంకల్పించారని చెప్పారు. రానున్న 30 ఏళ్ల పాటు వై.యస్.ఆర్.ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం అమల్లో ఉండేవిధంగా విధానపరమైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అన్నారు. రైతులపై ఎటువంటి భారం లేకుండా పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. రైతులకు అందే విద్యుత్ ఎప్పటికీ ఉచితమేనని, ఇందులో ఎటువంటి సందేహాలకు తావులేదని ఆయన స్పష్టం చేసారు. పథకం క్రింద రైతులకు నాణ్యమైన విద్యుత్ అందుతుందని, నాణ్యమైన విద్యుత్ కోసం ప్రశ్నించే హక్కు రైతుకు వస్తుందని తెలిపారు. ప్రస్తుతం రైతులకు ఉన్న ఒక్క కనెక్షన్‌ కూడా తొలగించబోమని,అనధికారికంగా ఉండే కనెక్షన్లను రెగ్యులరైజ్‌ చేస్తామని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఉచిత వ్యవసాయ విద్యుత్ నగదు బదిలీ పథకం సమస్యల పరిష్కారానికి, అవగాహనకు గ్రామ, మండల, డివిజన్, జిల్లా, కంపెనీ స్ధాయిలో కమిటీలు నియమిస్తారని ఆయన చెప్పారు. గ్రామ స్ధాయి కమిటి రైతుల కెవైసి, ఆధార్, సర్వే నంబరు తదితర వివరాలను నమోదు చేసుకుంటాయని తెలిపారు. ఈ పథకం క్రింద రైతులు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలను ప్రారంభించాలని ఆయన చెప్పారు. ఈ ఖాతాలు విద్యుత్ సబ్సిడీ నగదు బదిలీ పథకం కోసం వినియోగించడం జరుగుతుందని అన్నారు. ఈ పథకం క్రింద ఐఆర్డిఏ మీటర్లు (స్మార్ట్ మీటర్లు) ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఈ మీటర్ల ఏర్పాటు ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగం సమాచారం ఎస్.ఎం.ఎస్ రూపంలో రైతుల ఫోన్ లకు చేరుతుందని ఆయన చెప్పారు.   రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ జిల్లాలో ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఉచిత వ్యవసాయ విద్యుత్ నగదు బదిలీ పథకం ద్వారా ఎక్కడా అక్రమంగా విద్యుత్ వినియోగం లేకుండా అడ్డుకట్ట వేస్తుందని పేర్కొన్నారు. దీనిపై ప్రజల్లో అవగాహనకు విస్తృత స్ధాయిలో ప్రచారం జరగాలని సూచించారు. ఈ పథకం అమలులో జగన మోహన్ రెడ్డి ప్రభుత్వం వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేసారు. విద్యుత్ కు మన జీవనంతో విడదీయరాని సంబంధం ఏర్పడిందని పేర్కొంటూ విద్యుత్ సంస్కరణలలో భాగంగా మెరుగైన విద్యుత్ సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. అనధికారికంగా ఉన్న కనెక్షన్లు సైతం ఈ కార్యక్రమం ద్వారా రెగ్యులరైజ్ అవుతాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 17.55 లక్షల ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, 12,232 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగం జరిగిందని తెలిపారు. ఇందుకు రూ.8,353.60 కోట్ల మొత్తాన్ని ఏడాదికి రాయితీగా ప్రభుత్వం అందిస్తుందని, ఒక్కో రైతుపై రూ.47,601 కనీస రాయితీ ఉందని చెప్పారు.  ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ నివాస్, శాసన సభ్యులు కంబాల జోగులు, విశ్వసరాయి కళావతి, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్ధ (ఇపిడిసిఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ ఎస్. నాగలక్ష్మీ, ట్రాన్సు కో పర్యవేక్షక ఇంజనీరు ఎన్.రమేష్, డివిజనల్ ఇంజనీర్లు జి.టి.ప్రసాద్, చలపతి రావు., దువ్వాడ శ్రీనివాస్, తమ్మినేని చిరంజీవి నాగ్., ఇపిడిసిఎల్ అధికారులు తదితర అధికార అనధికారులు పాల్గొన్నారు.