ప్రతిభను మెరుగుపర్చుకొని, మరిన్ని అవార్డులను సాధించి జిల్లాకు గొప్పపేరు తేవాలని, ఇన్‌స్పైర్ అవార్డు గ్రహీత రమేష్‌ను, జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి అభినందించారు. జాతీయ స్థాయిలో ఇన్‌స్పైర్ అవార్డును గెలుచుకున్న, గంట్యాడ మండలం బుడతనాపల్లి పాఠశాల 9వ తరగతి విద్యార్థి బొబ్బిలి రమేష్, ఉపాధ్యాయులు గురువారం జిల్లా కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత రమేష్‌కు కలెక్టర్ సూర్యకుమారి, తన సంతకంతో కూడిన పుస్తకాన్ని బహూకరించారు. అతని కుటుంబ నేపథ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. అవార్డు సాధించిన అంశాలపై ప్రశ్నించారు. స్వచ్ఛభారత్ నిర్మాణంలో గణిత సహకారం అన్న తన ప్రాజెక్టుకు అవార్డు వచ్చిందని రమేష్ తెలిపారు. తక్కువ విస్తీర్ణంలో, తక్కువ ఖర్చుతో మరుగుదొడ్డి ట్యాంకును మరియు మరుగుదొడ్లను నిర్మించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. దీనివల్ల ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతోనే ప్రతీ ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించుకోవచ్చని ఆయన కలెక్టర్‌కు వివరించారు. బాగా చదువుకోవాలని, మరిన్ని అవార్డులను సాధించాలని కలెక్టర్ కోరారు. సాధన ద్వారా అన్ని అంశాలపైనా బాగా పట్టు సాధించవచ్చని సూచించారు. జిల్లాకు జాతీయ స్థాయి అవార్డును తీసుకురావడం అభినందనీయమని కలెక్టర్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి పి.లక్ష్మణరావు, రాజీవ్ విద్యామిషన్ ఏపిసి డి.కీర్తి, ప్రాజెక్టుకు గైడ్స్‌గా వ్యవహరించిన లెక్కల టీచర్లు ఆర్.సత్యారావు, కె.భాస్కరరావు, జిల్లా సైన్సు అధికారి బల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు.