ఖాతాదారులకు మంచి సేవలు అందించాలని జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి పేర్కొన్నారు. జిల్లా పరిషత్ స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ పదవ వార్షికోత్సవ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా రెవెన్యూ అధికారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఖాతాదారులకు మంచి సేవలు అందించడం వలన బ్యాంకుల పట్ల నమ్మకం పెరుగుతుందని, వాటి సేవలు వినియోగించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటుందని అన్నారు. బ్యాంకులతో ప్రతి వ్యక్తికి సంబంధం ఉంటుందని ఆయన పేర్కొంటూ ఇంటికి సంబంధించిన ప్రణాళికలు, పొదుపు, వ్యయాలతో బ్యాంకు ఖాతాలు ముడిపడి ఉంటాయని అన్నారు. సామాన్యునికి బ్యాంకులతో బలమైన బంధం ఉంటుందని, సమాజంలో నిరక్షరాస్యత తదితర కారణాల వలన వినియోగదారులు ఎక్కువగా ప్రత్యక్షంగా బ్యాంకు సేవలు వినియోగించుకుంటా రని ఆయన చెప్పారు. బ్యాంకు సిబ్బంది ప్రజా సంబంధాలు ఉండాలని, సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. పనిలో ఒత్తిడి ఉన్నప్పటికీ సిబ్బంది మంచి సేవలు అందిస్తున్నారని ఆయన ప్రశంసించారు. భారతీయ స్టేట్ బ్యాంకు రీజనల్ మేనేజర్ తపోదన్ దేహారీ మాట్లాడుతూ బ్యాంకు శాఖలు వినియోగదారులకు మంచి సేవలను అందించుటకు ఎప్పుడు కృషి చేస్తున్నామన్నారు. డిజిటల్ బాగా అందుతున్నాయని ఆయన వివరించారు. బ్యాంకు డిప్యూటీ మేనేజర్ డబ్ల్యు. కిరణ్ బాబు మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఎస్.బి.ఐ శాఖ చీఫ్ జనరల్ మేనేజర్ క్లబ్ లో ఉందన్నారు. ఖాతాదారుల పూర్తి సహాయ సహకారాలు వలన ఇది సాధ్యం అయిందని చెప్పారు. శాఖలో అతి తక్కువ సమయంలో ఖాతాదారులకు సేవలు అందించడం లక్ష్యంగా పని జరుగుతోందన్నారు. విశ్రాంత తహశీల్దార్ డి.పి. దేవ్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ శాఖ సొంత శాఖగా పరిగనిస్తున్నామని అన్నారు. ఖాతాదారులకు హాకర్స్ నుండి భద్రత ఉండాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. విశ్రాంత ఆర్మీ ఉద్యోగి చిన్నారావు మాట్లాడుతూ బ్యాంకు సేవలు బాగున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా డి.ఆర్.ఓ కేక్ ను కట్ చేసారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ సహాయ సంచాలకులు ఎల్.రమేష్, బ్యాంకు అధికారులు పి.ఎస్.కామేశ్వర రావు, పుష్ప, ఇతర సిబ్బంది తదతరులు పాల్గొన్నారు.