నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు..
Ens Balu
2
Srikakulam
2021-09-09 14:48:20
శ్రీకాకుళం జిల్లాలో చేపడుతున్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, బల్క్ మిల్క్ సెంటర్లు, డిజిటల్ ల్రైబరీలు, వెల్ నెస్ సెంటర్ల నిర్మాణపు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరు నాటికి పనులను స్వయంగా పర్యవేక్షిస్తామని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గ్రామ సచివాలయాలు, ఆర్.బి.కెలు, బిఎంసిలు, డి.ఎల్.బిలు, వెల్ నెస్ సెంటర్ల నిర్మాణపు పనులపై ఇంజినీరింగ్ అధికారులు, తహశీల్ధారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన నిర్మాణపు పనుల్లో 30 శాతం పురోగతి సాధించడం పట్ల అసహనం వ్యక్తం చేసారు. మిగిలిన జిల్లాలతో పోలిస్తే జిల్లాలో పురోగతి అధ్వాన్వంగా ఉందని, అధికారులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ప్రభుత్వం నిధులు మంజూరుచేసినప్పటికీ పనుల పురోగతి మాత్రం కనిపించడం లేదని, పనులు పూర్తిచేస్తే మరిన్ని నిధులు జిల్లాకు వచ్చే అవకాశం ఉందన్నారు. కాని అధికారుల నిర్లక్ష్యం వలన సుమారు రూ.100 కోట్ల నిధులు నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. అక్టోబర్ నెలాఖరు నాటికి అధికారులకు ఇచ్చిన లక్ష్యాలను పూర్తిచేయాల్సి ఉండగా, ఇంతవరకు 20 నుండి 30 శాతం లక్ష్యాలను పూర్తిచేయడం అధికారుల నిర్లక్ష్యంగా కనిపిస్తుందన్నారు. ఉపకార్యనిర్వాహక ఇంజినీర్లు, కార్యనిర్వాహక ఇంజినీర్లు సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ల సహకారంతో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేస్తే తప్పా నెలాఖరు నాటికి అనుకున్న లక్ష్యాలను సాధించలేరని హితవు పలికారు. నిర్ధేశించిన లక్ష్యాలపై అధికారులు మరింత ప్రత్యేక శ్రద్ధ వహించి అనుకున్న సమయానికి పూర్తిచేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు పెండింగులో ఉన్న బిల్లులు సమర్పించడంలో కొంత పురోగతి కనిపించిందని, పనులు పూర్తిచేసి బిల్లులు పెండింగులో ఉంటే వాటిని తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. అలాగే సిమెంటు సరఫరా లేదని అధికారులు తెలిపారని, వాటిపై తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటివరకు వెనుకంజలో ఉన్న మండలాల్లో రెవిన్యూ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక సమావేశాలను నిర్వహించి పనులు వేగవంతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు, ఇంజినీరింగ్ అధికారులు, తహశీల్ధారులు తదితరులు పాల్గొన్నారు.