ప్రభుత్వ పథకాలకు బ్యాంకర్లు లోన్లు అందించాలి..కమిషనర్
Ens Balu
2
విశాఖపట్నం
2020-09-09 21:25:28
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో గుర్తించిన వీధి వర్తకులకు బ్యాంకులు రుణ సహాయం అందించాలని జి.వి.ఎం.సి కమిషనర్ డాక్టర్ జి.సృజన బ్యాంకర్లను కోరారు. విశాఖలో బుధవారం వివిధ అర్బన్ బ్యాంకుల ప్రతినిధులతో జీ.వీ.ఎం.సీ. పాత సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలైన ప్రధానమంత్రి స్వానిధి ( స్ట్రీట్ వెండర్ ఆత్మనిర్భాన్ నిధి), జగనన్న తోడు, వైయస్సార్ చేయూత గల పథకాలకు గాను మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ గుర్తించిన వీధి వర్తకులకు, చిన్నచిన్న వ్యాపారస్తులకు, 45 సంవత్సరాలు దాటిన మహిళల లైన లబ్ధిదారులకు వ్యాపారాలు చేసుకునే నిమిత్తం వారి ఆర్థిక పురోగాభివృద్ధికి తమ వంతు భాగంగా బ్యాంకర్లు రుణ సదుపాయం కల్పించాలన్నారు. పి. ఎం. స్వానిధి పథకం కింద 10,500 మంది లబ్ధిదారుల జాబితాను సంబంధిత బ్యాంకులకు పంపించడం జరిగిందన్నారు. ఒక్క లబ్ధిదారికి రూ. 10,000/- లు చొప్పున, జగనన్న తోడు పథకానికి గానూ ఒక లక్ష మంది చిన్నచిన్న వ్యాపారస్తులను గుర్తించి, వారికి ఒక్కొక్కరికి పది వేల రూపాయల రుణ సహాయం అందించాలన్నారు. అదేవిధంగా వైయస్సార్ చేయూత పథకం కింద 45 నుండి 60 సంవత్సరముల వయస్సు గల మహిళలకు వ్యాపారం చేసుకోవడానికి 55,572 మంది లబ్ధిదారులకు రూ.75,000/- లు నాలుగు సంవత్సరంలో అందించుటకుగాను, అందులో మొదటి విడతగా రూ.18,250/- లు ఒక్కొక్క లబ్ధిదారుని ఖాతాలో ఇప్పటికే జమ చేయడం జరిగిందన్నారు. మిగిలిన రూ.56,750/-లు బ్యాంకు రుణ సదుపాయం లబ్ధిదారులకు బ్యాంకర్లు మంజూరు చేయాలని కమిషనర్ తెలిపారు. ఈ పథకాల ద్వారా లబ్ధిదారులకు ఈనెల 18వ తేదీలోగా రుణ సదుపాయం అందించాలన్న కమిషనర్ లోన్లు వచ్చేలా చూడాలని యు సి డి, పి. డి. డా. వై. శ్రీనివాసరావు ను కమిషనర్ ఆదేశించారు. ఈ బ్యాంకర్ల సమావేశంలో యు సి డి, పి. డి. డా. వై. శ్రీనివాసరావు, ఏ.పీ.డి.లు, డి.ఎం.ఎ.లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ రంగరాజన్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ వై శ్రీనాథ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.