జీవితంలో ఎదగాలంటే లక్ష్యం కావాలి..


Ens Balu
3
Vizianagaram
2021-09-11 10:17:28

జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఒక ఉన్నత లక్ష్యం ఏర్పర్చుకొని,అందుకోసం చిత్త శిద్ధి తో ప్రయత్నం చేయాలని జిల్లా కలెక్టర్  ఎ. సూర్య కుమారి పేర్కొన్నారు. తల్లి దండ్రులతో పాటు గురువులను  గౌరవించాలని,   అప్పుడే మన విజయాలకు మార్గం సుగమం అవుతుందని అన్నారు. శనివారం సెంచురియన్ యూనివర్సిటీని కలెక్టర్ సందర్శించారు.  విద్యార్థులనుద్దేశించి  ముందుగా ప్రసంగించారు. ఆమె ప్రసంగానికి ముగ్ధులైన  విద్యార్థులు   అనేక  ప్రశ్నలను సంధించారు. విద్యార్థులతో స్నేహ పూర్వకంగా మాట్లాడుతూ కెరీర్ గురించి, జీవితం లో ఎలా ఎదగాలి,  ఎలా మెలగాలనే అంశాలను  సున్నితంగా వివరించారు.   ముఖా ముఖి లో  విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు.  పలు ప్రశ్నలకు స్పందిస్తూ సివిల్ సర్వీస్ ఉద్యోగం లో  అనేక సవాళ్ళను ఎదుర్కోవలసి ఉంటుందని, వాటిని అధిగమించి కష్టపడితే అంతకు మించిన గుర్తింపు, గౌరవం తో పాటు  వృత్తి పరమైన సంతృప్తి  ఉంటుందని వివరించారు.  వత్తిడిని ఎదుర్కోవడానికి పిల్లలు తల్లి దండ్రులతో దృఢమైన బంధాన్ని ఏర్పరుచుకోవాలని, ఎంత  బాధ నైనా వారితో పంచుకుంటే తగ్గిపోతుందని హితవు పలికారు.  సోషల్ మీడియా లో అనవసర విషయాల పై దృష్టి పెట్టి సమయం వృధా చేసుకోకూడదని అన్నారు. ముఖ్యంగా  శారీరకంగా, మానసికంగా  దృడంగా ఉండాలని, ప్రతి అంశాన్ని స్పోర్టివ్ గా తీసుకోవాలని అన్నారు. దివ్యాంగుల  కోసం ఒక వృత్తి  కోర్స్ ను  నిర్వహించాలని యూనివర్సిటీ యాజమాన్యాన్ని కలెక్టర్ కోరారు. కోవిడ్ వాక్సినేషన్ అందరికి వేయించాలి, ప్రత్యేకంగా కోవిడ్ నిబంధనల పై అవగాహన కలిగించాలని అన్నారు.    యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా.జి.ఎస్.ఎన్. రాజు  యూనివర్సిటీ లో నిర్వహిస్తున్న కోర్స్ ల పై, ప్లేస్మెంట్స్, ఇతర పరిశ్రమలు, సంస్థల తో  అనుసంధానం తదితర  వివరాలను పవర్ పాయింట్ ద్వారా వివరించారు. అనంతరం కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఆచార్యులకు మెరిట్ సర్టిఫికెట్లను అందజేశారు. సీనియర్ ప్రొఫెసర్   డా.శాంతమ్మ  గారి చేతుల మీదుగా కలెక్టర్ ను సన్మానించి  జ్ఞాపిక ను అందజేశారు.  ఈ కార్యక్రమం లో రిజిస్ట్రార్ గోపినాధ్, డీన్లు  డా. రమణా రావు, డా.ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.