సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలని జివిఎంసి అదనపు కమిషనర్ డాక్టర్.వి.సన్యాసిరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన 6వ జోన్ 86వార్డు పరిధిలోని కుమ్మరపాలెంలోని శాతవాహన నగర్ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. వార్డులో ఆర్. పుష్పకు డెంగ్యూ వచ్చినందున ఆ ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. వర్షపు నీరు, ఇళ్లలో వాడే నీరు ఎక్కువ రోజులు నిలువ ఉండటం వలన, దోమలు వృద్ధి చెందుతాయని, నీటి నిల్వలు లేకుండా చూడాలని వారంలో మంగళవారం, శుక్రవారం “డ్రై డే”పాటించాలని సూచించారు. డెంగ్యూ కేసు నమోదైన ఇంటి పరిసరాలలో 200 మీటర్ల పరిధిలో ఫాగింగ్, స్క్రీనింగ్ చేయాలని మలేరియా సిబ్బందిని ఆదేశించారు. మలేరియా సిబ్బంది, సచివాలయ కార్యదర్శులు కలిసి మలేరియా పై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని ఆదేశించారు. మలేరియా సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించి వారి యోగక్షేమాలు అడిగి ఇంటి గోడ పై సంతకం చేయాలని ఆదేశించారు. విధుల పట్ల అలసత్వం ప్రదర్శించరాదని మలేరియా సిబ్బందిని హెచ్చరించారు. వార్డు సచివాలయ శానిటరీ కార్యదర్శులు ప్రతిరోజు ఉదయం వార్డుల్లో పర్యటించి కాలువలను శుభ్రం చేయించాలని, కాలువలలో అడ్డంకులను తొలగించి వర్షపు నీరు, మురుగునీరు సాఫీగా పోయే విధంగా చూడాలని ఆదేశించారు. పిన్ పాయింట్ వారీగా పారిశుద్ధ్య కార్మికులను సర్దుబాటు చేసి ఎవరికి నిర్దేశించుకున్న పనిని వారిచే చేయించాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త కనిపించకూడదని, డోర్ టు డోర్ చెత్త నిర్వహణ పక్కాగా జరగాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. ఈ పర్యటనలో వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్, మలేరియా సిబ్బంది, సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.