శ్రీవారి తీర్థ కైంకర్యపరుడు శ్రీ తిరుమలనంబి..
Ens Balu
2
Tirupati
2021-09-12 09:48:59
పాండిత్యం కన్నా భగవంతుడి సేవనే మిన్నగా భావించి శ్రీవారికి తీర్థ కైకర్యం చేసిన తిరుమల ప్రథమ పౌరుడు శ్రీ తిరుమలనంబి ప్రముఖ స్థానం పొందారని తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఆచార్యులు ఆచార్య చక్రవర్తి రంగనాథన్ పేర్కొన్నారు. టిటిడి అఖిల హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తిరుమలలోని దక్షిణ మాడ వీధిలో గల శ్రీ తిరుమలనంబి ఆలయ ప్రాంగణంలో 1048వ అవతార మహోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆచార్య చక్రవర్తి రంగనాథన్ కీలకోపన్యాసం చేస్తూ శ్రీవారి కైంకర్యాలు చేసేందుకు శ్రీ తిరుమలనంబి 973వ సంవత్సరంలో తిరుమలకు చేరుకున్నారని తెలిపారు. ఆయన తన తాతగారు అయిన యమునాచార్యుల ఆజ్ఞతో తిరుమలకు వచ్చి పాపవినాశనం తీర్థం నుండి ప్రతిరోజూ జలాన్ని తీసుకువచ్చి శ్రీవారిని అభిషేకించేవారన్నారు. వృద్ధాప్యంలో కూడా పాపనాశనం తీర్థం నుండి తీసుకువస్తునప్పుడు స్వామివారు జాలిపడి అంజనాద్రిలో ఉద్భవింపచేసిన ఆకాశగంగ తీర్థంతో అభిషేకం చేయవలసిందిగా ఆజ్ఞాపించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుందన్నారు. తిరుమలనంబి స్వామివారికి పుష్ప కైంకర్యం, మంత్రపుష్ప కైంకర్యం, వేదపారాయణ కైకర్యం, ఇతర కైంకర్యాలను చేస్తూ తిరుమలలో ఉంటూ అపరభక్తుడిగా నిలిచాడని చెప్పారు. శ్రీ తిరుమలనంబి స్వయాన శ్రీభగవద్ రామానుజులవారికి మేనమామ అన్నారు. శ్రీమద్ రామానుజాచార్యులకు రామాయణంలోని రహస్యార్థాలను చెప్పి, విశిష్టాద్వైత మతానికి పునాది వేశారని తెలియజేశారు. ఇంతటి పాండిత్యం గల తిరుమలనంబి తన జీవితం మొత్తాన్ని స్వామివారి కైంకర్యానికి అంకితం చేసి శ్రీవారి చేత తాత అని పిలిపించుకున్నారని, ఈ కారణంగానే వారికి తాతాచార్య వంశీయులుగా పేరు వచ్చిందని వివరించారు. అనంతరం " తిరుమంగై ఆళ్వారుల పాశురాలలో శ్రీ వేంకటేశ్వరుడు " అనే అంశంపై ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 16 మంది పండితులతో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో రమేష్‌బాబు, తిరుమలనంబి వంశీకులు కృష్ణమూర్తి తాతాచార్యులు, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ పురుషోత్తం, తాతాచార్య వంశీయులు పాల్గొన్నారు.