విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని వాల్మీకి షెడ్యూల్ తెగ ను నవశకం వెబ్ సైట్ లో నమోదు చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే ను ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతంలోని వాల్మీకి తెగ ఎస్టీ జాబితాలో ఉండగా రాష్ట్రంలోని వివిధ కులాలకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచే ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ నవశకం లో ఏజెన్సీ లోని ఎస్టీ తెగల జాబితా నుంచి వాల్మీకి తెగను తొలగించారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఆదివారం ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి కాంతిలాల్ దండే తో ఫోన్లో మాట్లాడారు. నవశకం వెబ్ సైట్ లో వాల్మీకి తెగ ను ఎస్టీ కులాల జాబితాలో చేర్చడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జరిగిన ఈ పొరపాటు కు కారణం ఏమిటో తెలుసుకోవాలని కోరారు. నవశకం వెబ్ సైట్ నిర్వహణకు సంబంధించిన రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి ఈ సమస్యను వెంటనే పరిష్కరించేలా చూస్తామని ఈ సందర్భంగా కాంతిలాల్ దండే ఉప ముఖ్యమంత్రి కి హామీ ఇచ్చారు. కాగా ఈ విషయం గా వాల్మీకి తెగకు చెందిన గిరిజనులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు.