తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బాలాలయ కార్యక్రమాల్లో భాగంగా నాలుగో రోజు ఆదివారం బాలబింబ స్థాపన శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలోని కల్యాణమండపంలో బాలాలయం ఏర్పాటుచేసి స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలు నిర్వహిస్తున్నారు. యాగశాలలో ఉదయం శ్రీ గోవిందరాజస్వామివారి బాలబింబ స్థాపన, మధ్యాహ్నం బింబవాస్తు, మహాశాంతి అభిషేకం చేపట్టారు. సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, శయనాధివాసం, హోత్రం, విశేష హోమం చేపడతారు. సెప్టెంబరు 13న సోమవారం ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, దివ్యప్రబంధ శాత్తుమొర నిర్వహిస్తారు. ఉదయం 9.40 నుండి 10 గంటల మధ్య తులా లగ్నంలో బాలాలయ సంప్రోక్షణం చేపడతారు. మధ్యాహ్నం నిత్యకట్ల కైంకర్యం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో రాజేంద్రుడు, ఆలయ ప్రధానార్చకులు పి.శ్రీనివాస దీక్షితులు, ఆగమ సలహాదారు వేదాంతం విష్ణుభట్టాచార్యులు, ఎఈవో ఎం.రవికుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్ ఎ.నారాయణ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ ఎ.కామరాజు పాల్గొన్నారు.