2వ రోజు 62 వేల మందికి వ్యాక్సినేషన్..
Ens Balu
3
విజయనగరం
2021-09-12 14:33:26
విజయనగరంజిల్లా వ్యాప్తంగా 81 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో శని, ఆదివారాల్లో నిర్వహించిన కోవిడ్ వ్యాక్సినేషన్ మెగా డ్రైవ్ కార్యక్రమంలో 1.15 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేసినట్టు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి వెల్లడించారు. జిల్లాలో శనివారం మెగా డ్రైవ్ ద్వారా 52,346 మందికి, ఆదివారం సాయంత్రం 7.30 గంటల వరకు 62వేల మందికి వ్యాక్సినేషన్ పూర్తిచేయడం జరిగిందన్నారు. రెండు రోజుల మెగా డ్రైవ్ అందరి సహకారంతో విజయవంతమైందని పేర్కొన్నారు. జిల్లాలో క్షేత్రస్థాయిలో పనిచేసిన వలంటీర్లు, ఆశ కార్యకర్తలు, ఆరోగ్య కార్తకర్తలు, గ్రామ సచివాలయ సిబ్బంది, ఎంపిడిఓలు, వైద్యాధికారులు తదితరులందరి కృషి కారణంగా రెండు రోజుల్లో సాధించాల్సిన లక్ష్యంలో 11.25 శాతంకు పైగా సాధించగలిగామన్నారు. జిల్లాలో ఒక్క డోసు కూడా వ్యాక్సిన్ తీసుకోనివారు, రెండో డోసు తీసుకోవలసిన వారు కలసి 10.18 లక్షల మంది వున్నారని, వీరందరికీ శతశాతం వ్యాక్సిన్ వేసే లక్ష్యంతో మెగా డ్రైవ్ కార్యక్రమం చేపట్టామన్నారు. జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ ఇంకా అందుబాటులో వుందని, అందువల్ల వ్యాక్సినేషన్ కార్యక్రమం తదుపరి రోజుల్లో కూడా కొనసాగుతుందన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది వ్యాక్సిన్ వేయాల్సిన వారందరినీ పెద్ద ఎత్తున సమీకరించి వ్యాక్సినేషన్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలించడం వల్లే ఒక్క రోజులో 62 వేల మందికి వ్యాక్సిన్ వేయగలిగామని పేర్కొన్నారు. జిల్లాలో శతశాతం వ్యాక్సినేషన్ చేసి కోవిడ్ మహమ్మారి బారి నుంచి జిల్లా ప్రజలను కాపాడటమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, అపోహలు వీడి ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా జిల్లాకు థర్డ్ వేవ్ రాకుండా నివారించడంలో సహకరించాలని కోరారు.