వరదలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి..


Ens Balu
2
Srikakulam
2021-09-13 06:33:30

వంశధార నది పరీవాహక ప్రాంతమైన ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నదీ ప్రవాహ పరిస్థితిపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సోమవారం రాత్రికి నదిలో 40వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంటుందన్న సమాచారంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్న నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ఉత్తర కోస్తా చీఫ్ ఇంజనీర్ ఎస్. సుగుణాకర్, వంశధార ఎస్ఈ డోల తిరుమల రావు తదితరులతో జిల్లాలో ప్రస్తుత ప్రాజెక్టులలో ఉన్న నీటిమట్టం పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. ఒడిస్సాలో కాట్రగడ్డ, గుడారి, మోహన, మహేంద్ర గడ, గుణపూర్,  కాశీనగరం తదితర ప్రాంతాల్లో 31.55 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతం నమోదైందని ఫలితంగా వంశధార నదికి భారీగా వరద నీరు చేరే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అలాగే తోటపల్లి, మడ్డువలస ప్రాజెక్టులలో పుష్కలంగా నీరు చేరినట్లు వివరించారు. వరద నీటిని కాట్రగడ్డ సైడ్ వియ్యర్ ద్వారా వంశధార ప్రధాన (హిరమండలం) జలాశయంలోకి మళ్లించాలని సూచించారు. జలాశయం సామర్థ్యం 19 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.5 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉందని, ఈ వరద నీటితో మరో టీఎంసీని ఇప్పుడు నిలవ చేయగలమని అధికారులు పేర్కొన్నారు. ప్రధాన జలాశయాన్ని పూర్తి సామర్థ్యంతో నిల్వ చేయాలంటే నేరేడి బ్యారేజ్ మాత్రమే శాశ్వత పరిష్కారం కావడంతో ప్రతిపాదనలు ఏ దశలో ఉన్నాయని అడిగారు. ఒడిస్సా భూభాగంలో మునిగిపోతున్న నూట ఎకరాల భూమిని కొనుగోలు చేసేందుకు, ఇంకా సర్వే, ఇన్వెస్టిగేషన్, డిజైన్ల రూపకల్పన కోసం రూ.68 కోట్లు ఖర్చు కానున్నాయని ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వంశధార ఎస్.ఇ వివరించారు. ఈ ప్రతిపాదనకు ఆమోదం పొందిన తర్వాత బ్యారేజి నిర్మాణం కోసం రూ.600 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని చేరవేసి వీలైనంత త్వరగా నేరడి నిర్మాణానికి ప్రజా ప్రతినిధులంతా కృషి చేస్తామని కృష్ణదాస్ చెప్పారు. వంశధార ప్రాజెక్టు కుడి,ఎడమ ప్రధాన కాలువల గట్ల పటిష్టం కోసం ఉపాధిహామీ మెటీరియల్ కాంపొనెంట్ నిధులు రూ.15 కోట్లు మంజూరు చేశామని, మిగిలిన కాలువల్లో పూడిక తీత పనులకు మరో రూ. 3 కోట్లు మంజూరయ్యాయని, నిధులు వెనక్కి వెళ్లక ముందే వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు.