కోవిడ్ వాక్సిన్ లక్ష్యాలను పూర్తి చేయాల్సిందే..
Ens Balu
3
Srikakulam
2021-09-13 08:44:06
కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమం లక్ష్యాలు పూర్తి చేయాల్సిందేనని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం మెలియాపుట్టి మండలం లింగుడుపురం గ్రామంలో వాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో సంబంధిత అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం భారీ ఎత్తున చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రాధాన్యతతో చేపట్టాలని ఆయన పేర్కొంటూ మెలియాపుట్టి మండలంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం మందకొడిగా సాగడం పట్ల అధికారులను ప్రశ్నించారు. పదివేల మందికి వ్యాక్సినేషన్ వేయాల్సి ఉండగా జాప్యం చేస్తున్నారని, లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో లక్ష డోసుల వాక్సిన్ లభ్యంగా ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ వేయాలని ఆయన ఆదేశించారు. లక్ష్యాలు పూర్తి చేయని వారిపై చర్యలు చేపడతామని కలెక్టర్ హెచ్చరించారు. వాక్సినేషన్ కార్యక్రమానికి అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు అవగాహన కల్పించి వ్యాక్సినేషన్ చేయించాలని ఆయన పేర్కొన్నారు. నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. మూడవ దశ కోవిడ్ నియంత్రణకు వ్యాక్సినేషన్ కార్యక్రమం బాగా తోడ్పడగలదని ఆయన పేర్కొంటూ దీనికి ప్రతి ఒక్కరూ అంకిత భావంతో కృషి చేయాలని అన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంపై అధికారులు, సిబ్బంది పూర్తి అవగాహన పొందాల్సిన అవసరం ఉందని కలెక్టర్ చెప్పారు. కోవిడ్ మహమ్మారి నివారణకు వ్యాక్సినేషన్ అత్యుత్తమ పరిష్కారమని గుర్తించాలని శ్రీకేష్ వివరించారు. వ్యాక్సినేషన్ వేసుకున్నప్పటికీ మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులు శుభ్రం చేసుకోవాలని ఆయన తెలిపారు. ప్రాథమిక సూత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో మాస్కులు వినియోగం పట్ల పూర్తిస్థాయి చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాక్సినేషన్ వేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వాక్సిన్ వేయించుకోవడం వలన జిల్లాను కోవిడ్ వ్యాప్తి కాకుండా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.