వైయస్సార్ జగనన్న గృహ నిర్మాణాలు అర్హులైన పేదలందరికీ ఇళ్ల నిర్మాణాల్లో భాగంగా నిర్దేశించిన లక్ష్యాల మేరకు త్వరిత గతిన పూర్తి చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ డా ఎ మల్లిఖార్జున సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం నుండి గృహ నిర్మాణ పనులపై వారంతపు సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గృహ నిర్మాణాలు, లేఅవుట్లు కు సంబంధించి గ్రౌండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇసుక కొరత ఉంటున్నదని దానిని అధిగమించటానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఎంపీడీవోలు గృహ నిర్మాణ పనులలో బాధ్యత వహించాలని ఎల్లవేళల పనుల పర్యవేక్షణ చేయాలన్నారు. కొన్ని మండలాల్లో జీరో గ్రౌండింగ్ లేఅవుట్ లున్నాయని వాటిలో గ్రౌండింగ్ పనులను మొదలు పెట్టాలన్నారు. అప్రోచ్ రోడ్ల నిర్మాణాలకు సంబంధించి ఎం జి ఎన్ ఆర్ఈ జి ఎస్ ఫండ్స్ ద్వారా వేగవంతంగా పనులను చేయాలన్నారు.
గ్రామ పంచాయత్, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు జనరల్ ఫండ్స్ ను బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణాలకు ఉపయోగించాల్సి ఉంటుందన్నారు. వాటికి సంబంధించిన ఎస్టిమేట్స్ ను తయారు చేసి నివేదికను వెంటనే పంపించాల్సిందిగా ఆదేశించారు. అప్రోచ్ రోడ్ల నిర్మాణాలు ఇతర లేఅవుట్ లలో ఉన్నా కూడా సంబంధిత నివేదికను తయారుచేసి రెండు రోజుల్లో పంపిస్తే నిధులను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. జీరో గ్రౌండింగ్ లేఔట్లకు సంబంధించి వచ్చే మీటింగ్ నాటికి కొంత పురోగతి కనిపించాలన్నారు. లేఅవుట్లలో భూముల చదును కు సంబంధించి పనులను వేగవంతం చేయాలన్నారు. కొన్ని మండలాలలో పనులు పూర్ పెర్ఫార్మెన్స్ గా ఉందనీ,కాబట్టి అలసత్వం వహించవద్దన్నారు. పి ఎం ఏ వై వైయస్సార్ గృహ సముదాయాలకు మ్యాపింగ్ చేసి పనులను మొదలు పెట్టాలన్నారు. లేఅవుట్ లలో ఇంకా జియో ట్యాగింగ్ చేయని వాటికి వెంటనే చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన గైడ్లైన్స్ ప్రకారం 500 పైబడి లబ్ధిదారులు ఉన్న పెద్ద లేఅవుట్లలో వర్కర్ల కొరకు షెడ్డు నిర్మించాల్సి ఉంటుందనీ, సంబంధిత నిధులను మంజూరు చేయడం జరుగుతుందని దాని నిర్మాణం పై కూడా దృష్టి పెట్టాలన్నారు. నిర్మాణ పనులు జరుగుతున్న లేఅవుట్లు, గృహ నిర్మాణాలలో నిరంతరం నీటి సరఫరా, విద్యుత్తు సౌకర్యం, ఏర్పాటు చేయాలని ఇసుక, సిమెంటు ,ఐరన్ అందుబాటులో ఉంచాలన్నారు.
ఈ సమావేశం లో జాయింట్ కలక్టర్ హౌసింగ్ కల్పనా కుమారి, పీ డి హౌసింగ్ శ్రీనివాస రావు, జెడ్ పీ సి ఈ వో నాగార్జున, ఆర్ డబ్ల్యుఎస్ ఎస్ ఈ రవి కుమార్, పీ ఆర్, ట్రాన్స్ కో, మైన్స్ తదితర శాఖ ల అధికారులు హాజరయ్యారు.