శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాల అభివృద్ధి..


Ens Balu
2
Nellore
2021-09-14 11:20:03

గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని టీటీడీ ఆలయాల్లో శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జోహార్ రెడ్డి చెప్పారు.  ఉప ముఖ్యమంత్రి కె నారాయణ స్వామి తో కలిసి మంగళవారం ఆయన జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని ఆలత్తూరు, కలికిరి కొండ, కార్వేటినగరం ఆలయాలను సందర్శించారు. ఆలయాల్లో స్వామి వార్ల దర్శనం అనంతరం వీరు అక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించారు.  ఈ సందర్భంగా కార్వేటినగరం పుష్కరిణి వద్ద జరిగిన సమావేశంలో ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి  మాట్లాడుతూ,  ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి తన నియోజకవర్గంలోని  టీటీడీ ఆలయాల్లో  పలు అభివృద్ధి పనులు చేయాలని కోరినట్లు చెప్పారు. ఇందుకోసం తనను ఆలయాలను పరిశీలించాలని కోరారని,  కోవిడ్  వల్ల పర్యటన ఆలస్యమైందని చెప్పారు. ఆలత్తూరు లోని శ్రీ వరద వేంకటేశ్వర స్వామి ఆలయం, కార్వేటినగరం వేణుగోపాల స్వామి,  ఆలయం కలిగిరి కొండ శ్రీవారి ఆలయాలను మంగళవారం పరిశీలించామని చెప్పారు.  కలికిరి కొండ వెళ్లే భక్తులకు తిరుమలకు వెళ్లిన అనుభూతి కలుగుతుందన్నారు. ఈ కేంద్రాన్ని ఆధ్యాత్మిక,  పర్యాటక పరంగా అభివృద్ధి చేయొచ్చని చెప్పారు. నియోజకవర్గంలోని టీటీడీ ఆలయాలకు సంబంధించిన అభివృద్ధి పనులను శ్రీ వాణి ట్రస్ట్ సమావేశంలో చర్చించి మంజూరు చేస్తామని చెప్పారు. ఎస్వీబీసి ద్వారా టీటీడీ ప్రతిరోజు ప్రసారం చేస్తున్న భగవద్గీత, గరుడ పురాణం లాంటి అనేక కార్యక్రమాలను ప్రజలు వీక్షించి ఆధ్యాత్మిక అలవాటు చేసుకోవాలని ఆయన కోరారు. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ,  ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో హిందూ ఆలయాలను పునరుద్ధరిస్తున్నామని చెప్పారు.  కార్వేటినగరంలో  వేణు గోపాల స్వామి కోనేరు మధ్యలో నిర్మిస్తున్న నీరాలి మండపాన్ని మరింత వెడల్పు చేయాలని కోరారు. టిటిడి కళ్యాణ మండపం లో వంటగది, మరుగుదొడ్లు, వసతి గదులు అభివృద్ధి చేసి భక్తులకు అందుబాటులోకి తేవాలని కోరారు. టీటీడీ చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు తో పాటు ఎస్ఈ సత్యనారాయణ, ఈఈ శివరామకృష్ణ, మనోహర్ పలువురు అధికారులు ఉన్నారు.