ఎంపీటీసి ,జడ్పిటిసి ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను ప్రశాంత వాతావరణంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా నిర్వహించి విజయవంతం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు ,సీ పీ లు, ఎస్పీలు , జిల్లా పరిషత్ సీఈఓ లతో ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ ఆదివారం ఎంపీటీసి ,జడ్పిటిసి ఎన్నికల ఓట్ల కౌంటింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని కేంద్రాల వద్దఅవసరమైన మౌలిక వసతులతో ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. కోవిడ్ నియమ నిబంధనలను తూ.చ. తప్పకుండా పాటించాలన్నారు. బారికేడింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు తో పాటు వీడియో కవరేజ్ చేయాలన్నారు.కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, అందుకు అవసరమైన మెటీరియల్ ను అందించాలన్నారు . ఏజెన్సీ ప్రాంత మండలాలలో మరియు సమస్యాత్మక కేంద్రాల వద్ద ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లిఖార్జున మాట్లాడుతూ విశాఖజిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లు కు అన్నీ సిద్ధం చేయడం జరిగిందని సీఎస్ కు తెలిపారు. జిల్లాలో ఎన్నికలు జరిగిన 612 ఎం పీ టీ సీ లు, 37 జెడ్ పీ టీ సీ స్థానాలకు 79 కౌంటింగ్ హాల్స్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 587 ఎంపీటీసి,568 జెడ్ పీటీసి కౌంటింగ్ టేబుల్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతున్దన్నారు . పది శాతం రిజర్వ్ సిబ్బంది తో కలిపి మొత్తం 3811 మంది కౌంటింగ్ సిబ్బంది ని నియమించడం జరిగిందన్నారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద బారికేడింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు, వీడియో కవరేజ్ ఏర్పాట్లు చేయడం జరుగుతున్నదన్నారు. గురువారం సాయంత్రం కౌంటింగ్ సిబ్బందికి మొదటిసారి శిక్షణను ఇవ్వడం జరిగిందని, శుక్రవారం కూడా మరొకసారి శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. ప్రతీ నియోజక వర్గానికి పరిశీలన నిమిత్తం ప్రత్యేక అధికారి ని నియమించడం జరిగిందన్నారు. కౌంటింగ్ సంబంధిత మెటీరియల్ను సిబ్బందికి ఇవ్వడం జరిగిందన్నారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు కు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఏజెన్సీ ప్రాంత మండలాలు,మరియూ సమస్యాత్మక కేంద్రాల వద్ద స్పెషల్ పోలీసు ప్రొటెక్షన్ ఏర్పాటుకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. కోవిడ్ నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించడం జరుగుతుందన్నారు. అత్యవసర పరిస్థితులలో అవసరమైన సిబ్బంది కొరకు 10 శాతం అదనపు కౌంటింగ్ సిబ్బందిని రిజర్వు లో సిద్ధం చేసుకోవడం జరుగుతున్నదన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, ఎస్ పి బి కృష్ణా రావు, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస మూర్తి, జిల్లా పరిషత్ సీఈఓ నాగార్జున, డి పి ఓ కృష్ణ కుమారి తదితరులు హాజరయ్యారు.