శ్రీకాకుళంలో 19న ఎంపీటీసి ఓట్ల లెక్కింపు..


Ens Balu
2
Srikakulam
2021-09-17 12:07:40

జెడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఈ నెల 19వ తేదిన జరుగుతోందని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమంపై శుక్రవారం మండల అధికారులతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో పది చోట్ల ఓట్ల లెక్కింపు జరుగుతోందన్నారు. అన్ని లెక్కింపు కేంద్రాలను రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు తక్షణం తనిఖీ చేసి అవసరమగు ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. లెక్కింపు గదుల్లో బారికేడింగ్, స్ట్రాంగ్ రూం నుండి లెక్కింపు గదుల వరకు బారికేడింగ్ చేయడం, బందో బస్తు, సిబ్బంది, తదితర ఏర్పాట్లు పరిశీలించాలని ఆయన ఆదేశించారు. కౌంటింగ్ 19వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. సిబ్బంది, ఏజెంట్లు ఉదయం 6 గంటల నాటికి సిద్దంగా ఉండాలని ఆయన సూచించారు.  ప్రతి కౌంటింగ్ హాల్ లో వెబ్ కాస్టింగ్, వీడియో రికార్డింగ్, జనరేటర్ ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. సిసి టివిలు ఇప్పటికే పనిచేస్తున్నాయని, అవి కొనసాగుతాయని ఆయన చెప్పారు. కోవిడ్ నియమ నిబంధనలు పక్కాగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు. ప్రతి టేబుల్ కు ఒక పర్యవేక్షక అధికారి, ముగ్గురు సిబ్బంది అవసరం ఉంటుందని, గతంలో రిజర్వ్ సిబ్బందితో పాటు కేటాయింపు సైతం జరిగిందని ఆయన వివరించారు. జిల్లాలో జెడ్పీటీసీ కి 37 టేబుల్స్, ఎంపిటిసికి 590 టేబుల్స్ ఏర్పాటుకు గతంలోనే కార్యాచరణ తయారు చేయటం జరిగిందని ఆయన తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, సిబ్బందికి వాక్సినేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

నేడు కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ :
కౌంటింగ్ సిబ్బందికి శని వారం శిక్షణ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. కౌంటింగ్ సిబ్బందికి శని వారం ఉదయం 7 గంటల నాటికి కౌంటింగ్ కేంద్రాల వద్ద హాజరు కావాలని ఆయన ఆదేశించారు. ఆదేశాలు ఉల్లంఘించే వారిపై క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చించారు.

కౌంటింగ్ ఏజెంట్ల నియామకం చేయాలి..
కౌంటింగ్ ఏజెంట్ల నియామకం తక్షణం చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పోటీ చేసిన అభ్యర్థులకు వెంటనే సమాచారం అందించి ఏజెంట్ల వివరాలు సమర్పించాలని ఈసుకోవాలని ఆయన అన్నారు. ఏజెంట్ల వివరాలు పోలీస్ శాఖతో సమన్వయం చేస్తూ అర్హులకు పాస్ లు జారీ చేయాలని ఆయన సూచించారు. శని వారం నాటికి పాస్ లు జారీ చేయాలని ఆయన ఆదేశించారు.

144 సెక్షన్ విధింపు..
కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. 50 మీటర్లు, వంద మీటర్ల చొప్పన రెండంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్ల ఆయన చెప్పారు.  జిల్లా స్థాయి కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఊరేగింపులు, ఉత్సవాలకు అనుమతి లేదు..
లెక్కింపు అనంతరం గెలుపొందిన అభ్యర్థులు ఊరేగింపులు, ఉత్సవాలు నిర్వహించుటకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.  మైక్ లను వినియోగించరాదని ఆయన పేర్కొన్నారు. ఎస్పీ అమిత్ బర్ధార్ మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల పరిధిలో పండాల్స్, మైక్ లు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయరాదన్నారు. అవసరం మేరకు ట్రాఫిక్ మళ్లింపులు చేయాలని, బందో బస్తు ఏర్పాటులో ఎటువంటి లోపాలు ఉండరాదని ఆయన స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్లు డా. కె.శ్రీనివాసులు, హిమాంశు కౌశిక్, ఆర్.శ్రీరాములు నాయుడు, రెవెన్యూ డివిజనల్ అధికారి ఐ. కిషోర్, జిల్లా పరిషత్ సీఈఓ బి.లక్ష్మీపతి, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ హెచ్.కూర్మారావు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.