యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు అక్టోబర్ 10వ తేదీన జరగనున్న నేపథ్యంలో జిల్లాలలో ఏర్పాటు చేస్తున్న పరీక్షా కేంద్రాలలో అన్ని రకాల మౌలిక వసతులను కల్పించాలని యూపీఎస్సీ పరీక్షల నిర్వాహకులు సంబంధిత జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. శుక్రవారం యూపీఎస్సి కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్న జిల్లాల కలక్టర్ లతో మాట్లాడారు. 10-10-2021 ఆదివారం ఉదయం పేపర్- I 9.30 నుంచి 11.30 వరకూ, మధ్యాహ్నం పేపర్- II 2.30 నుంచి 4.30 వరకూ జరుగుతాయన్నారు. పరీక్షలకు అభ్యర్థులు నిర్దేశించిన సమయానికి ముందుగా హాజరవ్వాలన్నారు. పరీక్షా విధివిధానాలను తప్పక పాటించాలన్నారు.పరీక్షలు నిర్వహించే కేంద్రాలలో కుర్చీలు, బెంచీలతో పాటు నిరంతర విద్యుత్ సరఫరా , ఫ్యాన్స్,టాయిలెట్స్, నీటి సౌకర్యం కల్పించాలన్నారు. పరీక్షలురాసే అభ్యర్థులు కోవిడ్ నిబంధనలను పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్ తో వైద్య సిబ్బంది ని అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లా కలెక్టర్ డా.ఏ.మల్లిఖార్జున మాట్లాడుతూ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల సజావుగా నిర్వహణకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నామన్నారు. విశాఖలో 32 పరీక్షా కేంద్రాల లో 12,166 మంది అభ్యర్థులు పరీక్షలను రాయ నున్నారన్నారు. పరీక్షా కేంద్రాల లో ఏర్పాట్లను పర్యవేక్షించుటకు ప్రత్యేక అధికారులను నియమించనున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి హాజరయ్యారు.