శ్రీకాకుళం జిల్లాలోని ప్రతి సెంటు భూమికి కూడా సాగునీటిని అందించే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆర్ అండ్ బి వసతి గృహంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ తన నియోజక వర్గంలో గల తొగరాం గ్రామంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరుచేస్తూ గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం పట్ల సభాపతి హర్షం వ్యక్తం చేసారు. కళాశాల ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రివర్గానికి, ప్రధానంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రివర్యులకు అభినందనలు తెలిపారు. తాను చేసే ఈ ప్రయత్నానికి సంపూర్ణ ప్రోత్సాహాన్ని అందించిన శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులకు సభాపతి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలతో పాటు వెన్నెలవలసలో వెటర్నరి పాలిటెక్నిక్ కళాశాలను గత మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఇది అభినందనీయమని గుర్తుచేసారు. ఇవేకాకుండా పొందూరులో డిగ్రీ కళాశాల, ఆమదాలవలసలో యన్.టి.ఆర్. గ్రీన్ ఫీల్డ్ స్టేడియం, వంశధార హైలెవెల్ కెనాల్, నారాయణపురం, నాగావళి అనుసంధాన ప్రోజెక్ట్, పట్టణ ఆరోగ్య కేంద్రంలో 30 పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా మార్పుచేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల కృతజ్ఞాతాభివందనాలు తెలియజేస్తున్నట్లు సభాపతి పేర్కొన్నారు. వీటితో పాటు జిల్లాలో మరికొన్ని పెద్ద ప్రోజెక్టులు క్లియర్ కాబోతున్నాయని చెప్పారు. ఇప్పటికే నేరేడి బ్యారెజ్ క్లియరెన్స్ అయిందని, దానిపై ఒడిషా ముఖ్యమంత్రితో చర్చించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేయబోతున్నట్లు తెలిపారు. ఆఫ్ షోర్ రిజర్వాయర్ కూడా త్వరలో క్లియర్ కాబోతుందని, నేరేడి క్లియరెన్స్ వలన వంశధార – బాహుదా నదుల అనుసంధానానికి పెద్దఎత్తున ప్రయత్నం జరగబోతుందని అన్నారు. నేరెడి బ్యారెజ్ పై ఇన్విస్టిగేషన్, సర్వే కూడా జరుగుతుందని, ఈ రెండు నదులు అనుసంధానం చేసుకోగలిగితే జిల్లాలో సెంటు భూమికి కూడా సాగునీటిని అందించేందుకు వీలు కలుగుతుందని సభాపతి స్పష్టం చేసారు. ఇది చిరకాలం నాటి కల అని, ఆ కల త్వరలో నిజం కాబోతుందని, ఆ కల నిజం అయ్యేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అవిరళమైన కృషిచేస్తున్నట్లు వివరించారు. ఇవేకాకుండా కిడ్నిరోగుల కోసం ఆసుపత్రి, ఉద్దాన ప్రాంత ప్రజలకు పరిశుద్ధమైన తాగునీరు, నరసన్నపేటలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ వంటి వాటిని ప్రభుత్వం ఇప్పటికే మంజూరుచేసిందని గుర్తుచేసారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి నుండి జిల్లాకు 70 వేల ఎకరాలు సాగులోకి తీసుకువచ్చే పరిస్థితికి ప్రభుత్వం క్లియర్ చేసిందని అన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని జిల్లాకు ప్రయత్నం చేయాలని ముఖ్యమంత్రిని కోరగా తక్షణమే స్పందిస్తూ సుజల స్రవంతిని తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేసినట్లు చెప్పారు. దీనివలన రణస్థలం, పొందూరు, లావేరు మండలాల్లో ప్రతీ సెంటు భూమి కూడా సాగులోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు. అలాగే మడ్డువలస రిజర్వాయర్ కు సంబంధించి రైతాంగానికి చెల్లించవలసిన నష్టపరిహారాన్ని త్వరలో అందించి ఆ పనులను కూడా పెద్దఎత్తున పూర్తిచేసుకొని ఎస్.ఎం.పురం పెద్దచెరువుకు దాన్ని కనెక్ట్ చేయబోతున్నట్లు సభాపతి స్పష్టం చేసారు. తద్వారా మరో 18 వేల ఎకరాలకు సాగునీటిని అందించే పరిస్థితి రాబోతుందని సభాపతి వివరించారు. ఈ విధంగా ఇరిగేషన్ , ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ పై పెద్ద ఎత్తున దృష్టిసారించి ప్రభుత్వం ముందుకువెళ్తుందని అన్నారు. ప్రభుత్వం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ విమర్శలు వస్తున్నాయని, విమర్శలు సహజమని, అయితే సద్విమర్శలు, సహేతుకమైన విమర్శలు చేస్తే తప్పక వాటిని స్వీకరిస్తామని, అంతేగాని లేనిపోని ఆరోపణలు చేయరాదని హితవు పలికారు.