పారదర్శకంగా ఓట్ల లెక్కింపు జరపాలి..
Ens Balu
3
Vizianagaram
2021-09-17 13:38:26
పారదర్శకంగా, పకడ్భంధీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి కోరారు. ఈ నెల 19న నిర్వహించనున్న జెడ్పిటిసి, ఎంపిటిసి ఓట్ల లెక్కింపునకు సంబంధించి, విజయనగరం డివిజన్ పరిధిలోని నియోజకవర్గ, మండల ప్రత్యేకాధికారులు, ఆర్ఓలకు కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం శిక్షణా కార్యక్రమం జరిగింది. ముందుగా మండలాల వారీగా లెక్కింపునకు జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి విధులను నిర్వహించాలని సూచించారు. ఎన్నికల నిబంధనలను సంపూర్ణంగా అవగాహన చేసుకొని, వాటిని అమలు చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఆర్ఓలదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితిలోనూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకల్లా మొదలు పెట్టాలని, దానికి అనుగుణంగా ముందుగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. 30వేల కంటే అధికంగా ఓట్లు ఉన్న చోట, అదనంగా సిబ్బందిని వినియోగించుకోవాలని సూచించారు. సెల్‌ఫోన్లను అమతించవద్దని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలను పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి, కౌంటింగ్ ఏజెంట్లకు వేక్సినేషన్ పూర్తయినట్లు సర్టిఫికేట్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. సర్టిఫికేట్ లేని వారందరికీ తక్షణమే కోవిడ్ ఆర్‌టిపిసిఆర్ పరీక్షను నిర్వహించి, ఫలితాన్ని బట్టి లోపలికి అనుమతించాలని సూచించారు. కేంద్రాలవద్ద మాస్కులను, శానిటైజర్లను ఏర్పాటు చేయాలని, ఏజెంట్లను అటూఇటూ తిరగడానికి అనుమతించవద్దని కలెక్టర్ ఆదేశించారు. ఓట్లను లెక్కించే విధానాన్ని, పాటించాల్సిన నిబంధనలను, కేంద్రాలు, బల్లల ఏర్పాటు తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా, జిల్లా ఎన్నికల శిక్షణ నోడల్ ఆఫీసర్ ఎస్.అప్పలనాయుడు వివరించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) డాక్టర్ జిసి కిశోర్ కుమార్, జాయింట్ కలెక్టర్(అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్‌కుమార్, డిఎఫ్ఓ వెంకటేష్, ఆర్‌డిఓ బిహెచ్ భవానీశంకర్, జెడ్‌పి సిఇఓ టి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.