కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే కౌంటింగ్..


Ens Balu
2
Vizianagaram
2021-09-17 13:41:18

కోవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ ఓట్ల లెక్కింపు నిర్వ‌హించడం జరుగుతుందని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీమతి ఎ. సూర్య‌కుమారి తెలిపారు.  కౌంటింగ్ సమయం లో  ప్రజలు గుమిగూడి ఉండకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో  పరిషత్తు ఎన్నికల కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లను చేయడం జరిగిందని తెలిపారు. కౌంటింగ్  అనంతరం కూడా విజేతలు రాలీలను చేయకూడదని స్పష్టం చేసారు.   ఈనెల 19న నిర్వహించనున్న జడ్పి టిసి,ఎంపిటిసి ఓట్ల లెక్కింపుపై శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఎస్.పి దీపిక ఎం.పాటిల్  తో కలసి పాత్రికేయుల సమావేశం లో మాట్లాడారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ   జిల్లాలో 549 ఎం.పి.టి.సి స్థానాలకు గాను 55 స్థానాల్లో ఏకగ్రీవం అయినాయని, 34  జెడ్.పి.టి.సి  లకు గాను 3 ఏకగ్రీవం అయినాయని తెలిపారు.  34 మండలాలకు గాను 31 చోట్ల  కౌంటింగ్  ప్రక్రియ  జరుగుతోందన్నారు.  కౌంటింగ్ కోసం 83 హాల్స్ నందు 820  టేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు.  ఇందు కోసం 34 మంది ఆర్.ఓ లు, 88 మంది ఎ.ఆర్.ఓ లు, 956 మంది కౌంటింగ్ పర్యవేక్షకులు, 1872 మంది కౌంటింగ్ అసిస్టెంట్ లు, 75 మంది స్ట్రాంగ్  రూం ఇంచార్జ్ లను నియమించడం జరిగిందన్నారు. .  కౌంటింగ్ సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు తప్పని సరిగా వ్యాక్సిన్ వేయించుకొని ఉండాలన్నారు.  ఇప్ప‌టికే వివిధ ద‌శ‌ల్లో సిబ్బందికి శిక్ష‌ణ ఇవ్వ‌డం జ‌రిగింద‌ని, శుక్ర‌, శ‌నివారాల్లో తుదివిడ‌త శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠమైన  మూడంచెల బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్.పి దీపిక పాటిల్ తెలిపారు. ర్యాలీల కోసం అనుమతి లేదని, 144 సెక్షన్ అమలులో ఉంటుందని అన్నారు. కౌంటింగ్ వద్ద   సిసి కెమెరాలు, డ్రోన్స్, వీడియో గ్రఫీ ద్వారా పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. అవసరమైన చోట రోప్ పార్టీ లను ఏర్పాటు చేస్తామన్నారు. రెండు డివిజిన్లలో  ఇద్దరు అదనపు ఎస్.పి లను ఇంచార్జ్ లుగా పర్యవేక్షిస్తారని అన్నారు.  కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్‌, జె.వెంక‌ట‌రావు, జెడ్‌పి సిఇఓ టి.వెంక‌టేశ్వ‌ర్రావు పాల్గొన్నారు.