డెంగ్యూ జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలి..
Ens Balu
3
విశాఖసిటీ
2021-09-17 13:45:36
మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని ప్రజలు డెంగ్యూ, మలేరియా వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జివిఎంసి అదనపు కమిషనర్ డాక్టర్ వి.సన్యాసిరావు విజ్ఞప్తి చేసారు. శుక్రవారం “డ్రై డే” సందర్భంగా ఆయన 2వ జోన్ 10వ వార్డు పరిధిలో ఐ.ఎస్.జి. నగర్, పాండురంగాపురం, ఆరిలోవ ఎఫ్.ఆర్.యు. సెంటర్ తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పాండురంగాపురంలోని డెంగ్యూ వ్యాధి సోకిన ఐ. చాణక్య ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డెంగ్యూపై తీసుకోవలసిన జాగ్రత్తలను కుటంబ సభ్యులకు వివరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పాండురంగాపురం పరిసరాలలో ఫాగింగ్, స్ప్రేయింగ్ చేయాలని, నీటి నిల్వలు లేకుండా చూడాలని, ప్రతి ఇంటికి వెళ్లి జ్వర బాధితులను గుర్తించాలని, ప్రతి ఇంటికి అతికించిన స్టిక్కర్ పై సంతకం చేయాలని మలేరియా సిబ్బందిని, వార్డు సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు. “డ్రై డే” సందర్భంగా అవగాహనా ర్యాలీలు జరిగే విధానాన్ని పరిశీలించారు. అనంతరం, ఆరిలోవ ఎఫ్.ఆర్.యు. సెంటర్ ను సందర్శించి, వ్యాక్సినేషన్ వేయు ప్రక్రియను పరిశీలించారు. 18 సం. లు పై బడిన, అర్హత గల ప్రతీ ఒక్కరికి మొదటి, రెండవ డోస్ వేయాలని, సిబ్బందిని ఆదేశించారు. ఎఫ్.ఆర్.యు. సెంటర్ పరిసరాలలో మరుగుదొడ్లు, శుభ్రంగా ఉంచాలని శానిటరీ సిబ్బందిని ఆదేశించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము, శానిటరీ సూపర్వైజర్ రమణ, శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావు, మలేరియా సిబ్బంది, వార్డు సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.