శ్రీకాకుళం జిల్లాలో కౌంటింగుకు సర్వం సిద్ధం..


Ens Balu
2
Srikakulam
2021-09-17 13:58:33

శ్రీకాకుళంజిల్లాలో ఈ నెల 19వ తేదిన జరగనున్న జెడ్.పి.టి.సి, యం.పి.టి.సి  ఓట్ల లెక్కింపునకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో  శుక్రవారం జిల్లా కలెక్టర్ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పదిచోట్ల ఓట్ల లెక్కింపు జరగబోతుందని, అన్ని లెక్కింపు కేంద్రాలకు రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. లెక్కింపు గదుల్లో బారికేడింగ్, స్ట్రాంగ్ రూం నుండి లెక్కింపు గదుల వరకు బారికేడింగ్, బందోబస్తు, సిబ్బంది తదితర ఏర్పాట్లను ఇప్పటికే సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. 19వ తేదీ ఉదయం 8.00 గం.లకు ఓట్లలెక్కింపు కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ తెలిపారు. కావున సిబ్బంది, ఏజెంట్లు ఉదయం 6.00 గం.ల నాటికి సిద్దంగా ఉండాలని ఆదేశాలు జారీచేయడం జరిగిందని చెప్పారు. ప్రతి కౌంటింగ్ హాల్ లో వెబ్ కాస్టింగ్, వీడియో రికార్డింగ్, జనరేటర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, సిసి టి.విలు ఇప్పటికే పనిచేస్తున్నాయని, అవి కొనసాగుతాయని కలెక్టర్ తెలిపారు. కోవిడ్ నేపధ్యంలో కోవిడ్ నియమ నిబంధనలు పక్కాగా పాటించాలని స్పష్టం చేసినట్లు కలెక్టర్ చెప్పారు. ప్రతి టేబుల్ కు ఒక పర్యవేక్షక అధికారి, ముగ్గురు సిబ్బంది ఉంటారని, వీరితో పాటు రిజర్వ్ సిబ్బందిని కూడా సిద్ధం చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు. జిల్లాలో 38 మండలాలకు గాను జెడ్.పి.టి.సి అభ్యర్ధి మరణించడంతో ఒక జెడ్.పి.టి.సి స్థానానికి ఎన్నిక జరగనందున 37 మండలాల జెడ్.పి.టి.సిలకు గాను 37 టేబుళ్లను ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా 667 ఎం.పి.టి.సి స్థానాలకు గాను 66 మంది ఏకగ్రీవం కాగా , మరో 11 చోట్ల ఎం.పి.టి.సి అభ్యర్ధులు మరణించడంతో మిగిలిన 590 స్థానాలకు గాను 590 టేబుళ్లను ఏర్పాటుచేసినట్లు కలెక్టర్ స్పష్టం చేసారు. జిల్లావ్యాప్తంగా 68 కౌంటింగ్ హాళ్లను , 612 కౌంటింగ్ టేబుళ్లను సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. ఇందుకోసం 854 మంది కౌంటింగ్ సూపర్ వైజర్లను, 863అసిస్టెంట్ సూపర్ వైజర్లను, 2,584 మంది కౌంటింగ్ అసిస్టెంట్లను  వెరశి 4,301 మంది సిబ్బందిని కౌంటింగ్ ప్రక్రియకు నియమించడం జరిగిందని కలెక్టర్ వివరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు, సిబ్బందికి వేక్సినేషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. శనివారం ఉదయం 7.00 గం.లకు కౌంటింగ్ కేంద్రాల వద్దకు కౌంటింగ్ సిబ్బంది హాజరవుతారని, వారికి కౌంటింగ్ ప్రక్రియపై పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు.  పోటీచేసిన అభ్యర్థుల నుండి ఏజెంట్ల వివరాలు తీసుకోవాలని, పోలీస్ శాఖతో సమన్వయం చేస్తూ అర్హులకు పాసులు జారీచేసే విధంగా ఆదేశాలు జారీచేయడం జరిగిందని అన్నారు. ప్రతీ కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, 50 మీటర్లు, వంద మీటర్ల చొప్పన రెండంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటుచేసినట్లు కలెక్టర్ చెప్పారు. కౌంటింగునకు సంబంధించి జిల్లా స్థాయి కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. లెక్కింపు అనంతరం గెలుపొందిన అభ్యర్థులు ఎటువంటి ఊరేగింపులు, ఉత్సవాలు నిర్వహించుటకు అనుమతి లేదని, మైక్ లను వినియోగించరాదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ పాత్రికేయుల సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణాధికారి బి.లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.