భీమిలి ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు కృషి..మంత్రి


Ens Balu
2
Bheemili
2020-09-10 20:12:43

విశాఖజిల్లా  భీమిలి నియోజకవర్గంలో  యువతకు  ఉద్యోగ అవకాశాలు కొరకు పరిశ్రమలను స్థాపించేందుకు కృషి చేస్తామని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం ఆయన నియోజకవర్గంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు,  శంకుస్థాపనలు చేశారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూట్ మిల్లు సమస్య పరిష్కరించటంతో పాటు  స్థానికంగా మరిన్ని కంపెనీల  ఏర్పాటుతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయన్నారు.  కార్మికుల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. పాదయాత్ర లో ప్రజా సమస్యలు తెలుసుకున్న ముఖ్యమంత్రి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు మరిన్ని సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. అన్ని మతాలను వారి విశ్వాసాలను ఆయన గౌరవిస్తారని, రాష్ట్రం ప్రజలందరూ తమ ప్రభుత్వం పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నారన్నారు.  భీమునిపట్నం మండలం, రేఖవాణిపాలెం పంచాయితీ మరడపాలెం గ్రామంలో రూ.13  లక్షలతో నిర్మించిన సిసి డ్రైన్స్, మూలకుద్దు గ్రామంలో రూ.70 లక్షల మూలకుద్దు నుంచి శ్రీనగర్ కాలనీ వరకు 1.50 KM  నిర్మించిన   సి.సి రోడ్లను ప్రారంభించి,  రూ.15 లక్షలతో నిర్మించే ఆరోగ్య కేంద్రానికి  శంకుస్థాపన చేశారు. అనంతరం వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా అందిస్తున్న  పోషకాహార కిట్లను గర్భవతులకు, బాలింతలకు అందజేశారు. వార్డు వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది, ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. నీటి సమస్య ఉందని  స్థానికులు మంత్రి దృష్టికి తీసుకొని రావటంతో వెంటనే స్పందించి నీటి సమస్య లేకుండా ట్యాంకుల ద్వారా  నీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాయకులు , అధికారులు పాల్గొన్నారు.